vuliv: కొత్తఫీచర్‌ను ప్రవేశపెట్టిన వూలివ్ యాప్.. ఆఫ్‌లైన్‌లో వీడియో ప్లే!
- వూషేర్‌తో అందుబాటులోకి
- ఫొటోలను కూడా చూడొచ్చు
- ఇంటర్నెట్ అవసరం లేకుండానే పనిచేసే యాప్
ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ వూలివ్ (VuLiv) ఓ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఒకరి ఫోన్లో ఉన్న వీడియోలు, ఫొటోలను మరొకరి ఫోన్లో చూడవచ్చు. ఈ స్ట్రీమింగ్ కోసం ఎలాంటి ఇంటర్నెట్ అవసరం లేదు. ఇది పూర్తిగా ఆఫ్‌లైన్ ఫీచర్. వూషేర్ పేరుతో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పటివరకు వీడియోను పంపించుకోవాలంటే షేరిట్, గూగుల్ ఫైల్స్ వంటి యాప్‌ల ద్వారా పంపించుకోవాల్సి వచ్చేది. కొన్ని సార్లు ఫోన్లలో సరిపడినంత మెమొరీ లేని కారణంగా వీడియోలను పంపడం కుదిరేది కాదు.
కానీ ఈ వూషేర్ ద్వారా కేవలం డౌన్‌లోడ్ చేసిన వీడియోలను మాత్రమే కాకుండా యూట్యూబ్, వూట్ వంటి వీడియో స్ట్రీమింగ్ సర్వీసుల్లో ప్లే చేసే వీడియోలను కూడా ఇతరుల ఫోన్లకు పంపించవచ్చు. ఈ ఫీచర్ ద్వారా వీడియోలు, పాటలు, ఫొటోలు, ఫైళ్లను కూడా లోకల్‌గా పంపించుకునే సదుపాయం కలుగుతుంది. కాకపోతే డేటా మార్పిడి జరగాల్సిన రెండు ఫోన్లలోనూ వూలివ్ యాప్ ఉండితీరాలి.