bsnl: వచ్చే నెల నుంచి 4జీ ఎల్‌టీఈ సేవలు ప్రారంభించనున్న బీఎస్ఎన్ఎల్
- మొదటగా కేరళలో
- తర్వాత ఒడిషాలో
- వెల్లడించిన బీఎస్ఎన్ఎల్ చైర్మన్
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ త్వరలో 4జీ ఎల్‌టీఈ సేవలను ప్రారంభించనుంది. ముందుగా కేరళలో, తర్వాత ఒడిషాలో ఈ సేవలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఎల్‌టీఈ సేవలు అందుబాటులోకి తీసుకురావడం వల్ల వినియోగదారులకు అత్యుత్తమ డేటా వేగాన్ని అందించే అవకాశం కలుగుతుంది. 3జీ కవరేజీ తక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి ఈ సేవలు ప్రారంభించనున్నట్లు బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాత్సవ తెలిపారు.
ప్రైవేట్ టెలికాం సంస్థలైన ఎయిర్‌టెల్, వొడాఫోన్, జియోలను ఎదుర్కునేందుకు బీఎస్ఎన్ఎల్ చాలా కష్టపడాల్సి వస్తోంది. వాటి పోటీని తట్టుకోవడానికి ఆఫర్ల మీద ఆఫర్లు ప్రవేశపెట్టినప్పటికీ 4జీ సేవలు లేని కారణంగా వెనకబడాల్సి వస్తోంది. కేరళ, ఒడిషాల తర్వాత దేశమంతటికీ 4జీ సేవలను అందించి వాటి పోటీని ఎదుర్కోవాలని బీఎస్ఎన్ఎల్ యోచిస్తోంది.