China: ఘోర ప్రమాదం నుంచి కాపాడిన సీట్ బెల్టులు!
- చైనాలో ఘటన
- అతి వేగంతో వచ్చిన కారు
- గోడను ఢీ కొని 100 మీటర్లు ముందుకి
- స్వల్ప గాయాలతో బయటపడ్డ ఇద్దరు వ్యక్తులు
కార్లలో ప్రయాణించేటప్పుడు సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తుంటారు. ఏదైనా ప్రమాదం జరిగితే సీట్ బెల్ట్ రక్షణగా ఉంటుందని చెబుతారు. చైనాలో జరిగిన ఓ ప్రమాద ఘటనను చూస్తే సీటు బెల్టు ఎంతగా ఉపయోగ పడుతుందో తెలుస్తుంది. వాహనాల రాకపోకల కోసం నిర్మించిన ఓ సొరంగం గుండా ఓ కారు ప్రయాణిస్తోంది.
అతి వేగంగా వచ్చిన ఆ కారు ఒక్కసారిగా అదుపుతప్పి గోడను ఢీ కొంది. దీంతో పల్టీలు కొడుతూ సుమారు 100 మీటర్ల దూరం వెళ్లిపోయింది. అయినప్పటికీ అందులోని ఇద్దరు వ్యక్తులు స్వల్పగాయాలతో మాత్రమే బయటపడ్డారు. సీటు బెల్టులు పెట్టుకోవడంతో వారు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ప్రమాదానికి డ్రైవరు అతి వేగమే కారణమని పోలీసులు తేల్చారు.