actress sana: రహస్య కెమెరాల పట్ల సమంత, మెహ్రీన్ లు ఎంతో ఆవేదన చెందారు: నటి సనా
- మహిళల జీవితాలను నాశనం చేస్తున్న స్పై కెమెరాలు
- టూత్ బ్రష్ లో కూడా కెమెరాలు పెడుతున్నారు
- స్పై కెమెరాలకు లైసెన్స్ లు జారీ చేయాలి
స్పై కెమెరాలు మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని... ఈ కెమెరాల నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని సినీ నటి సనా అన్నారు. ఈ రహస్య కెమెరాలు ఆన్ లైన్ లో కేవలం రూ. 250కే లభిస్తున్నాయని... దీంతో, ఎంతో మంది వీటిని సొంతం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో హెవెన్ హోమ్స్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిన్న ఓ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 'యాంటీ రెడ్ ఐ' పేరుతో చేపడుతున్న మిస్డ్ కాల్ (8099259925) క్యాంపెయిన్ బ్రోచర్ ను సనా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సనా మాట్లాడుతూ, రహస్య కెమెరాల వల్ల కలుగుతున్న అనర్థాల పట్ల నటీమణులు సమంత, మెహ్రీన్ లు కూడా ఎంతో ఆవేదన చెందారని అన్నారు. వీరిద్దరూ కూడా ఈ మిస్డ్ కాల్ క్యాంపెయిన్ లో భాగస్వాములయ్యారని చెప్పారు. టూత్ బ్రష్, షాంపు బాటిల్స్ లో కూడా చాలా సులువుగా స్పై కెమెరాలు పెట్టేస్తున్నారని అన్నారు. ఈ కెమెరాలను దుర్వినియోగం చేస్తూ మహిళల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తుపాకులకు లైసెన్సులు ఇస్తున్నట్టుగానే... ఈ కెమెరాలకు కూడా లైసెన్స్ లు తప్పనిసరి చేయాలని అన్నారు.