India: 1962లో భారత్‌పై చైనా యుద్ధం చేయడానికి కారణం వేరే ఉందట!: బయటకొచ్చిన అసలు విషయం
- యుద్ధంతో తన స్థానాన్ని పదిలపరుచుకోవాలనుకున్న మావో
- నెహ్రూ ప్రకటించిన ఫార్వర్డ్ పాలసీ మరో కారణం
- ‘చైనాస్ ఇండియా వార్’ పుస్తకంతో కొత్త విషయాలు వెలుగులోకి
1962లో భారత్‌పై యుద్దం ప్రకటించిన చైనా విజయం సాధించింది. ఆ యుద్ధాన్ని బూచిగా చూపి ఇప్పటికీ భారత్‌ను భయపెట్టాలని ప్రయత్నిస్తోంది. నిజానికి ఆ యుద్ధాన్ని వేరే ఉద్దేశంతో చేసినట్టు తాజాగా విడుదలైన ఓ పుస్తకం వెల్లడించింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించిన ‘చైనాస్ ఇండియా వార్’ అనే పుస్తకంలో పలు విషయాలను వెల్లడించారు.
భారత్‌పై యుద్ధం ప్రకటించడం ద్వారా చైనాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతోనే కమ్యూనిస్ట్ నేత మావో జిడాంగ్ ఈ యుద్ధానికి పూనుకున్నారని పుస్తకం పేర్కొంది. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో అప్పటికే స్వాతంత్ర్యం పొందిన దేశాల్లో చైనాను బలమైన శక్తిగా తీర్చిదిద్దాలన్న మరో ఉద్దేశంతో పాటు, అప్పటి భారత ప్రధాని నెహ్రూ ప్రారంభించిన ‘ఫార్వర్డ్ పాలసీ’ కూడా యుద్ధానికి దారితీసిందని స్వీడన్‌కు చెందిన స్ట్రాటజిక్ ఎఫైర్స్ నిపుణుడు బెర్టిల్ లింట్నర్ రాశారు.
ఫార్వర్డ్ పాలసీకి తెరతీసిన నెహ్రూ ఈ విధానం ద్వారా చైనాకి చెందిన భూభాగాల్లో భారత బలగాలతో పెట్రోలింగ్ నిర్వహించడం చైనా కన్నెర్రకు కారణమైందట. 1958లో భారత్‌పై యుద్ధానికి చైనా తహతహలాడినా 1962లో తమ ప్రణాళికను అమలు చేసింది. కాగా, మావో కారణంగా యుద్ధానికి ఒక్క ఏడాది ముందు చైనాలో లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారని పుస్తకంలో పేర్కొన్నారు.
1959లో టిబెట్‌ను చైనా ఆక్రమించడంతో దలైలామా భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందారు. ఇది చైనాకు కంటగింపుగా మారింది. దీంతో చైనాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనే ఉద్దేశంతో భారత్‌ను మావో చాలా సాఫ్ట్‌గా టార్గెట్ చేసుకున్నారని పుస్తకం వెల్లడించింది. చైనా యుద్ధానికి సిద్ధమవుతోందని ఇంటెలిజెన్స్ అధికారి బోలానాథ్ చెప్పినా నెహ్రూ నమ్మలేదని పుస్తకంలో పేర్కొన్నారు.