YSRCP: నేడు జగన్ పాదయాత్రకు విరామం.. రేపు ప్రారంభం కానున్న యాత్ర!
- క్రిస్మస్ సందర్భంగా పాదయాత్రకు విరామం
- బస చేసిన శిబిరంలోనే క్రిస్మస్ జరుపుకోనున్న జగన్
- రేపు గాండ్లపెంట నుంచి పాదయాత్ర ప్రారంభం
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు విరామం ప్రకటించారు. బస చేసిన శిబిరంలోనే జగన్ క్రిస్మస్‌ను జరుపుకోనున్నారు. ఆదివారం రాత్రి ఆయన బస చేసిన శిబిరం వద్దకు తల్లి విజయమ్మ, సతీమణి భారతి, బాబాయి వివేకానందరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు వచ్చి జగన్‌ను కలిశారు. క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పి ఇడుపులపాయకు బయలుదేరారు.
43వ రోజుకు చేరిన జగన్ ప్రజాసంకల్ప యాత్ర గాండ్లపెంట మండలం కటారుపల్లి క్రాస్ రోడ్స్ వద్దకు చేరుకోగానే 600 కిలోమీటర్లకు చేరుకుంది. ఇందుకు గుర్తుగా జగన్ అక్కడ వేప మొక్కను నాటారు. అనంతరం గాండ్లపెంట శివారులో ఏసు కృప చర్చి వద్ద నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. జగన్ పాదయాత్ర రేపు తిరిగి గాండ్లపెంట నుంచి ప్రారంభం అవుతుంది.