TTV Dinakaran: తిరుగులేని ఆధిక్యానికి దినకరన్... ఒక్కరోజులో ఓటరు నాడిని మార్చేసిన వీడియో!

  • ఎన్నికకు ఒక రోజు ముందు అమ్మ వీడియో
  • గంటల వ్యవధిలోనే మారిపోయిన సమీకరణలు
  • తనను కావాలనే ఇబ్బంది పెడుతున్నారన్న సంకేతాలను పంపిన దినకరన్
  • దినకరన్ వాదనతో ప్రజల్లో సానుభూతి 

ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ప్రధాన పోటీ అన్నాడీఎంకే, డీఎంకే మధ్య ఉంటుందని, అన్నాడీఎంకే ఓట్లను దినకరన్ చీల్చి డీఎంకే గెలుపునకు బాటలు వేస్తారని మొన్నటి వరకూ వేసిన అంచనాలు తారుమారయ్యాయి. జయ మరణంతో ఖాళీ అయిన స్థానంలో ఆమెకు సరైన వారసుడిని తానేనంటూ బరిలోకి దిగిన దినకరన్ ను ఓటర్లు ఆశీర్వదించారు. ఇప్పటికే ఆయన తిరుగులేని మెజారిటీని సాధించి, ప్రత్యర్థులకు అందనంత స్థాయికి వెళ్లారు. ప్రస్తుతం దినకరన్ మెజారిటీ 15 వేలుగా ఉంది. ఆయనకు 29,257 ఓట్లు రాగా, అన్నాడీఎంకేకు 14,854, డీఎంకేకు 7,750 ఓట్లు వచ్చాయి.

కాగా, ఎన్నికకు సరిగ్గా ఒక్క రోజు ముందు జయలలితకు ఆసుపత్రిలో చికిత్స చేస్తున్న వీడియోను దినకరన్ వర్గం విడుదల చేయడంతోనే మొత్తం సమీకరణలు మారిపోయాయని ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో జయలలితకు అత్యంత సన్నిహితంగా ఉండటం, అప్పట్లో జయ వెంట నడిచి, ఆర్కే నగర్ స్థానాన్ని ఆమె కోసం వదిలేసిన వెట్రివేల్ ను తన వర్గంలో కలుపుకోవడం దినకరన్ కు కలిసొచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం కావాలనే తనపై కుట్ర చేస్తోందన్న సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన సఫలమయ్యారని, అది ఆయనపై సింపథీ పెరిగేలా చేసిందని, అందుకే ఇంత భారీ మెజారిటీతో ఆయన విజయం సాధ్యమైందని విశ్లేషిస్తున్నారు.

TTV Dinakaran
Jayalalita
Tamilnadu
RK Nagar
Voting
Counting
  • Loading...

More Telugu News