Airtel: ఎయిర్‌టెల్‌కు మరో ఎదురుదెబ్బ.. పేమెంట్స్ బ్యాంకు సీఈవో గుడ్‌బై!
- యూఐడీఏఐ వెసులుబాటు ఇచ్చిన ఒక్క రోజులోనే మరో ఝలక్
- శశి అరోరా రాజీనామాను ధ్రువీకరించిన ఎయిర్‌టెల్
- పేమెంట్స్ బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించిన రూ.138 కోట్లను తిరిగి జమ చేసిన టెలికం దిగ్గజం
భారతీ ఎయిర్‌టెల్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆధార్ దుర్వినియోగం ఆరోపణలతో వివాదాల్లో కూరుకుపోయిన ఎయిర్‌టెల్‌కు ఆ సంస్థ పేమెంట్స్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో శశి అరోరా ఝలక్ ఇచ్చారు. తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ-కేవైసీ విషయంలో ఆధార్‌ను దుర్వినియోగం చేసిన ఆరోపణలపై ఆధార్ సంస్థ యూఐడీఏఐ ఎయిర్‌టెల్ ఈ-కేవైసీ లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ నేపథ్యంలో శశి రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది. శశి రాజీనామాను ఎయిర్‌టెల్ ధ్రువీకరించింది. అతని భవిష్యత్తు మరింత బాగుండాలని ఆకాంక్షించింది.శశి అరోరా 2006 నుంచి ఎయిర్‌టెల్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. గతేడాది జూన్ 1న ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు సీఈవోగా నియమితులయ్యారు.
ఆధార్ దుర్వినియోగం ఆరోపణలపై ఎయిర్ పేమెంట్స్ బ్యాంకు, ఎయిర్‌టెల్‌ల ఈ-కేవైసీ లైసెన్స్‌ను యూఐడీఏఐ రద్దు చేసింది. సిమ్ వెరిఫికేషన్‌లో భాగంగా ఈ-కేవైసీ ద్వారా ఆధార్‌ను అనుసంధానం చేస్తున్న ఎయిర్‌టెల్.. ఖాతాదారుల అనుమతితో పనిలేకుండానే ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకులో ఖాతాలు ప్రారంభించినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో యూఐడీఏఐ ఈ నిర్ణయం తీసుకుంది.
వినియోగదారుల ఖాతాల్లోంచి ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకులోకి మళ్లించిన రూ.138 కోట్లను తిరిగి వారి ఖాతాల్లో జమ చేయడంతో యూఐడీఏఐ కొంత వెసులుబాటును కల్పించింది. జనవరి 10 వరకు తమ ఖాతాదారుల సిమ్‌లను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవచ్చని పేర్కొంది. దీంతో ఎయిర్‌టెల్‌కు భారీ ఊరట లభించినట్టు అయింది. అయితే అంతలోనే శశి అరోరా రాజీమానా చేయడం ఎదురుదెబ్బగానే చెబుతున్నారు.