Himchalpradesh: హిమాచల్‌ప్రదేశ్ సీఎం పోస్టుపై కొనసాగుతున్న సస్పెన్స్.. రేసు నుంచి తప్పుకున్న ధుమాల్!
- కొత్త ఎమ్మెల్యేల్లో కుదరని ఏకాభిప్రాయం
- తెరపైకి జైరామ్ ఠాకూర్, కేంద్రమంత్రి నడ్డా
- శాసనసభాపక్ష నేత ఎన్నిక నేడే
హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. తాను సీఎం రేసులో లేనంటూ ప్రేమ్ కుమార్ ధుమాల్ శనివారం రాత్రి తేల్చిచెప్పారు. శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు నేడు ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. సీఎం అభ్యర్థి రేసు నుంచి ధుమాల్ తప్పుకోవడంతో ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన జైరామ్ ఠాకూర్, కేంద్రమంత్రి జేపీ నడ్డా పేర్లు అనూహ్యంగా బయటకొచ్చాయి.
ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం లేదన్న విషయం తెలుసుకున్న కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, నరేంద్రసింగ్ తోమర్‌లు తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. అధిష్ఠానంతో చర్చలు జరపనున్నారు. కాగా, ముఖ్యమంత్రి రేసులో ఠాకూర్ ముందువరుసలో ఉన్నప్పటికీ తాజాగా నడ్డా కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ఉన్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి.
మరోవైపు ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో తాను ఉన్నట్టు వస్తున్న వార్తలపై ధుమాల్ స్పందించారు. అదంతా మీడియా సృష్టేనని, తాను లేనని శనివారం రాత్రి ధుమాల్ స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి అయిన ధుమాల్ తాజా ఎన్నికల్లో ఓటమి పాలవడం ఆయనకు అశనిపాతమైంది.