Chandrababu: ఏసు ప్రభువు దయవల్లే ఇదంతా జరిగింది: చంద్రబాబు
- రాజధాని కోసం ఒక్క ఎకరం కూడా సేకరించాల్సిన అవసరం రాలేదు
- క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబునాయుడు
- ఏసీ కాలేజీలో ఒక బ్లాక్ కు ఎన్టీఆర్ పేరు
- క్రైస్తవుల అభివృద్ధికి కృషి చేస్తానన్న చంద్రబాబు
తాను నవ్యాంధ్ర రాజధాని కోసం భూములు కావాలని అడిగిన వేళ, ఒక్క ఎకరం కూడా సేకరించాల్సిన అవసరం లేకపోయిందని, రైతులు స్వచ్ఛందంగా తమ భూములను ఇచ్చారని, ఇదంతా ఏసు ప్రభువు దయ వల్లే జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. గుంటూరు ఏసీ కాలేజీలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన, కేక్ కట్ చేసి పేద క్రిస్టియన్లకు చంద్రన్న కానుకలను బహూకరించారు. ఈ సందర్భంగా కాలేజీలోని ఒక బ్లాక్ కు ఎన్టీఆర్ పేరు పెట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో క్రైస్తవుల అభివృద్ధికి తన ప్రభుత్వం ఎంత చేయగలుగుతుందో అంతా చేస్తుందని అన్నారు. ఏసు దయవల్లనే ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోయినా, అభివృద్ధి కొనసాగుతుందని తెలిపారు. ఒక్క పైసా లేకుండా కట్టుబట్టలతో ఇక్కడకు వచ్చామని గుర్తు చేసిన ఆయన, సుమారు 45 వేల కోట్ల విలువ చేసే 35 వేల ఎకరాల భూమిని ఒక్క పైసా తీసుకోకుండా రైతులు ఉదారంగా ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారని, ఇదంతా ఏసు ప్రభువు చూపించిన స్ఫూర్తేనని చెప్పారు. మరో వారంలో అమరావతి అసెంబ్లీ తదితర భవనాల అన్ని నిర్మాణాల నమూనాలనూ పూర్తి చేస్తామని తెలిపారు. ఐదారు వారాల్లో పూర్తి డిజైన్లు వస్తాయని చంద్రబాబు అన్నారు.