Indrakaran Reddy: తెలంగాణలో నూతన ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల అభివృద్ధి వేగవంతం: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
- కామన్ గుడ్ ఫండ్ (సర్వ శ్రేయోనిధి ) పై సమీక్ష
- రూ.182 కోట్లతో చేపట్టే ఆలయాల నిర్మాణ పనులకు సీజీయఫ్ కమిటీ ఆమోదం
- చెంచుగూడేల్లో ఆలయ నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని ఆదేశం
- వేద పాఠశాల నిర్వహణకు ప్రత్యేక మార్గదర్శకాలు
రాష్ట్రంలో నూతన ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సర్వ శ్రేయో నిధిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంబంధిత అధికారులతో సచివాలయంలోని ఆయన చాంబర్ లో ఈ రోజు సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో నూతన ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. 615 నూతన ఆలయాల నిర్మాణానికి రూ.159 కోట్లు, బలహీన వర్గాల కాలనీల్లో నిర్మించే 239 ఆలయాలకు రూ.23 కోట్లతో (మొత్తం రూ.182 కోట్లు ) చేపట్టబోయే పనులకు కామన్ గుడ్ ఫండ్ కమిటీ ఆమోదం తెలిపింది.
ఉమ్మడి మహబూబ్ నగర్ (37ఆలయాలు), ఉమ్మడి నల్గొండ (3 ఆలయాలు ) జిల్లాల్లోని చెంచుగూడేల్లో అసంపూర్తిగా ఉన్న ఆలయ నిర్మాణ పనులను ఐటిడీఏ సహకారంతో వెంటనే చేపట్టాలని అధికారులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. అదేవిధంగా కామన్ గుడ్ ఫండ్ కు వివిధ ఆలయాలు బకాయిపడ్డ నిధులను వెంటనే వసూలు చేసేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. ధూప దీప నైవేద్య పథకం వర్తింపు కోసం జిల్లా స్థాయిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, జనవరి 15లోపు దేవాదాయ శాఖ కమిషనర్ కు సమర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
మరోవైపు వేద పాఠశాల నిర్వహణకు ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కార్యదర్శి శివశంకర్, సీజీయఫ్ కమిటీ సభ్యులు గుంటి జగదీశ్వర్, నర్సింహమూర్తి, గురు రాజు, దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ శ్రీనివాస రావు, జాయింట్ కమిషనర్ కృష్ణవేణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.