lalu: లాలూ కుమార్తె మీసా భారతిపై ఛార్జీషీటు
- దాఖలు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్
- మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు
- జనవరి మొదటివారంలో విచారణ
దాణా కుంభకోణం కేసులో సీబీఐ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా ప్రకటించిన కొద్దిసేపటికే ఆయన కుమార్తె మీసా భారతిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జీషీటు దాఖలు చేసింది. రూ.8 వేల కోట్ల మేర మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై అభియోగపత్రాన్ని పటియాల హౌస్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి నరేష్‌కుమార్ మల్హోత్రాకు సమర్పించింది. ఈ ఛార్జీషీటుకు సంబంధించి జనవరి మొదటివారంలో విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది.
గతంలో ఇదే ఆరోపణలతో మీసా భారతి ఛార్టెడ్ అకౌంటెంట్ రాజేశ్ అగర్వాల్‌పై అనుబంధ ఛార్జీషీటును ఈడీ దాఖలు చేసింది. అలాగే సోదరులు సురేంద్ర, వీరేంద్ర జైన్ సహకారంతో అగర్వాల్ సందేహాస్పద లావాదేవీలు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మార్చి 20న జైన్ సోదరులను, మే 22న అగర్వాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అంతకుముందు డిసెంబర్ మొదటి వారంలో మీసా భారతిని ఈడీ ప్రశ్నించింది. ఢిల్లీలోని ఆమె, ఆమె భర్తకు చెందిన నివాసాల్లో సోదాలు జరిపింది.