swiggy: 2017లో ఎక్కువ మంది ఆర్డర్ చేసిన వంటకం చికెన్ బిర్యానీ!
- వెల్లడించిన ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ
- ఎక్కువ మంది సెర్చ్ చేసింది - పిజ్జా
- దేశీయ వంటకాలకే ఎక్కువ ప్రాధాన్యం
2017లో ఎక్కువ మంది భారతీయులు చికెన్ బిర్యానీని ఆర్డర్ చేసినట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వెల్లడించింది. ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్, హైదరాబాద్, బెంగళూరు, పూణె, చెన్నై, కోల్‌కతా నగరాల్లోని ప్రజలు తమ యాప్‌లో వచ్చిన ఆర్డర్ల విశ్లేషణను స్విగ్గీ విడుదల చేసింది. ఈ విశ్లేషణలో ఎక్కువ ఆర్డర్లు పొందిన వంటకాల్లో చికెన్ బిర్యానీ మొదటిస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో మసాలా దోశ, బటర్ నాన్, తందూరీ రోటీ, పనీర్ బటర్ మసాలాలు ఉన్నాయి.
అయితే తమ యాప్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన వంటకాల్లో మాత్రం పిజ్జా మొదటిస్థానంలో ఉందని స్విగ్గీ పేర్కొంది. దాదాపు 5 లక్షల మంది పిజ్జా గురించి సెర్చ్ చేశారని తెలిపింది. తర్వాతి స్థానాల్లో బర్గర్లు, చికెన్, కేకులు, మోమోలు ఉన్నట్లు చెప్పింది. దీన్ని బట్టి చూస్తే విదేశీ వంటకాలను సెర్చ్ చేసి, దేశీయ వంటకాలను ఆర్డరిచ్చేందుకే భారతీయులు ఆసక్తి చూపుతున్నట్లు అర్థమవుతోంది. ఇక డిసెంబర్ 3న తమకు ఎక్కువ ఆర్డర్లు వచ్చినట్లు పేర్కొంది. బ్రేక్‌ఫాస్ట్ కోసం ఎక్కువగా మసాలా దోశ, ఇడ్లీ, వడ, లంచ్ కోసం చికెన్, మటన్ బిర్యానీలు, స్నాక్స్‌లో పావ్ బాజీ, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ రోల్ వంటకాలకు ఎక్కువ ఆర్డర్లు వచ్చాయని వివరించింది.