jamuna: సారథీ స్టూడియోతో నాది పెద్ద అనుబంధం .. ఇక్కడి ఫస్టు హీరోయిన్ నేనే!: జమున
- అప్పట్లో సారథీ స్టూడియో ప్రాంతమంతా అడవి
- స్టూడియో పైనున్న రూముల్లో ఉండేవాళ్లం
- జగ్గయ్య గారు నన్ను భయపెడుతూ ఉండేవారు
తెలుగు సినిమా వైభవంలో హైదరాబాద్ - సారథీ స్టూడియో ప్రధానమైన పాత్రను పోషించిందనే చెప్పాలి. ఎంతోమంది నటీనటులను అందించిన స్టూడియో ఇది .. ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన స్టూడియో ఇది. అలాంటి ఈ స్టూడియోతో తనకి గల అనుబంధాన్ని గురించి జమున ప్రస్తావించారు. " హైదరాబాద్ లో ఫస్టు స్టూడియో .. సారథీ స్టూడియో .. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అదే పేరు ఉంచారు .. సంతోషం" అన్నారు
"ఈ స్టూడియోలో చేసిన ఫస్టు సినిమా 'మా ఇంటి మహాలక్ష్మీ'. అందులో మొదటి హీరోయిన్ .. హైదరాబాద్ కే ఫస్టు హీరోయిన్ నేను. ఆ సినిమాకి రామినీడు దర్శకుడు .. గంగాధరరావు నిర్మాత. కానీ కొంతమంది తెలుగు సినిమాను తామే హైదరాబాద్ కి తీసుకొచ్చినట్టుగా చెప్పుకోవడం మంచిది కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే సారథీ స్టూడియో ఎప్పటి నుంచో హైదరాబాద్ లో వుంది. ఈ స్టూడియో కొత్తలో వరుసగా ఇక్కడ ఐదు సినిమాలు చేశాను. ఇక్కడ అడుగు పెడుతూనే నాకు ఆనాటి రోజులు గుర్తుకువచ్చాయి. స్టూడియోలో పై రూముల్లో వుండే వాళ్లం .. అంతా అడవి .. దాంతో జగ్గయ్య గారు నన్ను భయపెడుతూ ఉండేవారు" అని చెప్పుకొచ్చారు.