Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్ పై రేణుకా చౌదరి ఫైర్!
- రాజ్యసభలో సచిన్ ప్రసంగానికి అడ్డుతగిలిన కాంగ్రెస్ ఎంపీలు
- ధ్వజమెత్తిన బీజేపీ నేతలు
- 'భారతరత్న' మీకు సభలో మాట్లాడే అవకాశం ఇచ్చిందా అంటూ రేణుక ఫైర్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పై కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే, 'రైట్ టు ప్లే అండ్ ఫ్యూచర్ ఆఫ్ స్పోర్ట్స్' అనే అంశంపై రాజ్యసభలో సచిన్ నిన్న మాట్లాడాల్సి ఉంది. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ప్రధాని మోదీ అసంబద్ధ వ్యాఖ్యలు చేశారంటూ రాస్యసభలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. సచిన్ దాదాపు 10 నిమిషాల పాటు నిలబడే ఉన్నా... నిరసనల జోరు తగ్గలేదు. ఈ నేపథ్యంలో సభ నేటికి వాయిదా పడింది.
ఈ క్రమంలో, కాంగ్రెస్ ఎంపీలు ప్రవర్తించిన తీరుపట్ల బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఓ దిగ్గజ ఆటగాడికి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రేణుకా చౌదరి మాట్లాడుతూ, సచిన్ పై ఫైర్ అయ్యారు. 'భారతరత్న' పురస్కారం పార్లమెంట్ లో మీకు మాట్లాడేందుకు లైసెన్స్ ఇచ్చిందా? అని ప్రశ్నించారు. వాస్తవానికి యూపీఏ హయాంలోనే రాజ్యసభకు సచిన్ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. రాజ్యసభ సభ్యుడిగా సచిన్ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి 348 రోజులపాటు సభ జరిగితే... ఆయన కేవలం 23 రోజులు మాత్రమే హాజరయ్యారు. నటి రేఖ అయితే 18 రోజులు మాత్రమే సభకు వచ్చారు.