2g scam: 2జీ స్కాం తీర్పుపై మన్మోహన్, చిదంబరం, స్వామి, థరూర్, సిబల్ ల స్పందన
- న్యాయం గెలిచిందన్న మన్మోహన్
- హైకోర్టులో అప్పీల్ చేయాలన్న స్వామి
- మోదీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసిన సిబల్
2జీ స్కాం కారణంగా యూపీఏ ప్రభుత్వం ఎదుర్కొన్న సమస్యలు అన్నీఇన్నీ కావు. కాంగ్రెస్ అవినీతిలో కూరుకుపోయిందంటూ ఎన్డీఏ నేతలు ఆ పార్టీపై అవకాశం వచ్చినప్పుడల్లా విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో, ఈ కేసును నేడు పటియాలా హౌస్ కోర్టు కొట్టి వేసింది. నిందితులకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ తీర్పుపై పలువురు రాజకీయ ప్రముఖులు ఎలా స్పందించారో చూద్దాం.
మన్మోహన్ సింగ్: కోర్టు తీర్పును గౌరవిస్తున్నాం. యూపీఏపై ఎలాంటి ఆధారాలు లేకుండానే చెడు ప్రచారం జరిగిందనే విషయం కోర్టు తీర్పుతో వెల్లడైంది.
చిదంబరం: గత ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు కుంభకోణంలో ఉన్నారనే ప్రచారాలు తప్పు. ఈ రోజు అదే విషయం రుజువైంది.
సుబ్రహ్మణ్యస్వామి: సరైన ఆధారాలతో కేంద్ర ప్రభుత్వం వెంటనే హైకోర్టులో అప్పీల్ చేయాలి.
శశి థరూర్: అమాయకులను ఇబ్బంది పెట్టారనే విషయాన్ని కోర్టు గుర్తించింది. న్యాయం గెలిచింది.
కపిల్ సిబల్: ప్రధాని మోదీ పార్లమెంటుకు వచ్చి వివరణ ఇవ్వాలి. 2జీతో పాటు పలు కుంభకోణాల్లో యూపీఏ ప్రభుత్వం కూరుకుపోయిందనే తప్పుడు ప్రచారంతోనే మోదీ ప్రభుత్వం ఏర్పడింది. కానీ కోర్టు తీర్పుతో అసలు విషయం ఏమిటో అందరికీ తెలిసింది. 2జీ అనేది విపక్షానికి చెందిన అబద్ధాలతో కూడిన స్కాం అనేది రుజువైంది.