mothkupalli: పేద కవులను అవమానించినందుకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి: మోత్కుపల్లి నర్సింహులు
- ఎన్టీఆర్ ఊసెత్తని సభలు తెలుగు మహాసభలు కానే కావు
- రామోజీరావును ఆహ్వానించకపోవడం దారుణం
- పెత్తందార్లు, ధనవంతుల సభ కోసం డబ్బులు వృథా చేశారు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించి గద్దర్, విమలక్క, వందేమాతరం శ్రీనివాస్ వంటి పేదకవులను అవమానించినందుకు సీఎం కేసీఆర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. తెలుగు జాతికి గౌరవాన్ని తెచ్చిపెట్టిన ఎన్టీఆర్‌ను గుర్తుచేసుకోకపోవడం, తెలుగు అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్న రామోజీరావును ఆహ్వానించకపోవడం దారుణమని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
'తెలుగు మహాసభలకు వచ్చిన నటీనటులు, కళాకారులందరూ కూడా భయపడుతూనే వచ్చారు తప్ప ప్రేమతో వచ్చారని నేను అనుకోవడం లేదు. వీటిని తెలుగు మహాసభల్లా కాకుండా కేసీఆర్ తన పొగడ్తల కోసం ఏర్పాటు చేసిన మహాసభల్లా నిర్వహించారు. పేదవారికి ఉపయోగపడే కార్యక్రమాలకు కాకుండా ఇలాంటి అనవసర కార్యక్రమాలపై ప్రజల డబ్బును వృథా చేయడం కేసీఆర్ మానుకోవాలి' అని మోత్కుపల్లి అన్నారు.
ఎన్టీఆర్‌ను గౌరవించని తెలుగు మహాసభలు ఎందుకని ప్రతి తెలుగువాడు అనుకుంటున్నాడని ఆయన పేర్కొన్నారు. ఈ మహాసభల ద్వారా ఏ ఒక్క పేద కవి కూడా లబ్ధి పొందలేదు సరికదా, తెలుగు ఖ్యాతిని ఇనుమడింప జేసిన అందెశ్రీ, ఎన్వీరమణ, చలమేశ్వర్ రావు, లావు నాగేశ్వరరావు వంటి వారికి అవమానం కలిగిందని మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. 'కేసీఆర్ మనసులో రాజకీయ, ప్రాంతీయ ఆలోచనలు ఇంకా ఉన్నాయనడానికి ఈ మహాసభలే నిదర్శనం. ఆయన పేదవాడి పక్షాన పనిచేయడం లేదు. ఈ ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉంది' అన్నారు.