Telangana: వెధవలు.. పనీపాట రాని దున్నపోతులు..!: అధికారులపై జయశంకర్ జిల్లా కలెక్టర్ తిట్లదండకం!
- ఓడీఎఫ్‌పై సమీక్షలో ఎంపీడీవోలపై కలెక్టర్ దుర్భాష
- ఆందోళనకు దిగిన ఎంపీడీవోలు
- జిల్లా పరిషత్ సీఈవోకు వినతి పత్రం
- సామూహిక సెలవులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళికి కోపమొచ్చింది. మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీఓ)పై విరుచుకుపడ్డారు. మామూలుగా కాదు.. మీరు దున్నపోతులు.. పనీపాట రాని వెధవలు అంటూ మండిపడ్డారు. కలెక్టర్ తిట్ల దండకంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపీడీవోలు ఆందోళనకు దిగారు. జిల్లా పరిషత్ సీఈవోకు వినతిపత్రం అందించారు.
మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమంలో ఎంపీడీవోలు పారిశుద్ధ్య అధికారులుగా పనిచేస్తున్నారు. బుధవారం ఓడీఎఫ్‌పై సమీక్షించేందుకు కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ‘‘వెధవలు, పనీపాట రాని దున్నపోతులు, ఎక్కువ జీతం తీసుకుంటున్నా పని చేతకాదు. మిమ్మల్నందర్నీ ఏం చేయాలి? సస్పెండ్ చేయమంటారా?’’ అంటూ దుర్భాషలాడడంతో ఎంపీడీవోలు విస్తుపోయారు.
కలెక్టర్ తీరుకు నిరసనగా బుధవారం ఎంపీడీవోలు సామూహిక సెలవు ప్రకటించారు. కలెక్టర్ తమ తీరు మార్చుకోవాలని కోరారు. మరోవైపు, సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేసిపెట్టుకున్నారన్న కారణంతో గణపురం ఎంపీడీవో శ్రీధర్ స్వామిని కలెక్టర్ బుధవారం సస్పెండ్ చేశారు.