ipl: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోచ్‌గా గ్యారీ కిర్‌స్టన్?
- మంతనాలు జరుపుతున్న జట్టు ఫ్రాంచైజీ
- గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ కోచ్‌గా వ్యవహరించిన గ్యారీ
- ఐపీఎల్ 2018 పనులు ముమ్మరం
ఐపీఎల్-2018 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిర్‌స్టన్‌ను తీసుకువచ్చేందుకు ఆ జట్టు ఫ్రాంచైజీ తీవ్రంగా యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయం గురించి ఆయనతో మంతనాలు కూడా జరిపినట్లు సమాచారం. గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు కోచ్‌గా వ్యవహరించినప్పటికీ ఆ జట్టు ప్రదర్శన మెరుగు పడలేదు. 2014 పాయింట్ల పట్టికలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆఖరి స్థానంలో, 2015లో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.
2011లో టీమిండియా ప్రపంచకప్ సాధించినపుడు గ్యారీ భారత జట్టు కోచ్‌గా ఉన్నారు. అలాగే ఈ ఏడాది బిగ్‌బాష్ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్ జట్టుకు కూడా గ్యారీ శిక్షణనిచ్చారు. అయితే గ్యారీని బ్యాటింగ్ కోచ్‌గా ఎంచుకున్న విషయం ఆర్‌సీబీ జట్టు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. వచ్చే ఏడాది జనవరి 27, 28న బెంగళూరులో ఐపీఎల్-2018 ఆటగాళ్ల వేలం జరగనున్న సంగతి విదితమే.