krishnamraju: ప్రభాస్ మిడిసిపడలేదు .. అప్పుడెలా వున్నాడో ఇప్పుడూ అలాగే వున్నాడు: కృష్ణంరాజు కితాబు
- నా అలవాటే ప్రభాస్ కి వచ్చింది
- అతిథులను బాగా గౌరవిస్తాడు
- తన దగ్గర ఇతరులను విమర్శించడం అతనికి నచ్చదు
- ప్రభాస్ సక్సెస్ కి అతని వ్యక్తిత్వం కూడా ఓ కారణం
కృష్ణంరాజు .. తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు. "ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించడం .. వాళ్లకి ఇష్టమైనవి చేసి పెట్టడం మా నాన్నగారి కాలం నుంచి వుంది. అదే అలవాటు నాకు వచ్చింది .. శత్రువైనా సరే ఇంటికి వస్తే మర్యాద చేసి పంపించేవాడినే గానీ .. అవమానపరిచేవాడిని కాదు. ప్రభాస్ కి కూడా అదే పద్ధతి అలవాటైంది" అన్నారు.
"నలుగురు కూర్చుని మాట్లాడుకునేటప్పుడు అక్కడ లేని వాళ్ల గురించి ఎవరైనా మంచిగా మాట్లాడితే ఓకే .. కానీ చెడుగా మాట్లాడితే మాత్రం ప్రభాస్ ఊరుకునేవాడు కాదు. అక్కడ లేని వ్యక్తిని గురించి విమర్శిస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదు .. నా దగ్గర అలా ఎప్పుడూ మాట్లాడొద్దంటూ ఆపేసేవాడు. ప్రభాస్ కి అంత సంస్కారం ఉండటం వల్లనే .. బలమైన వ్యక్తిత్వం ఉండటం వల్లనే 'బాహుబలి' పూర్తయ్యేవరకూ మరో సినిమా చేయలేదు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినప్పటికీ గాల్లో తేలిపోలేదు. 'బాహుబలి'కి ముందు ప్రభాస్ ఎలా వుండేవాడో .. ఇప్పటికీ అలాగే వున్నాడు. అది అతని గొప్పతనం .. వ్యక్తిత్వం కూడా సక్సెస్ కి కారణమవుతూ ఉంటుంది" అని చెప్పుకొచ్చారు.