krishnamraju: నా కొడుకెప్పుడూ తప్పు చేయడని మా నాన్న నా గురించి గర్వంగా చెప్పారట: కృష్ణంరాజు
- మా నాన్న నన్ను ఓ స్నేహితుడిగానే చూశారు
- ఓ స్నేహితుడి గానే ఇండస్ట్రీకి పంపించారు
- నేనంటే ఆయనకి ఎంతో నమ్మకం
తెలుగు తెరపై ధీరత్వం .. వీరత్వం .. గంభీరత్వం కలిగిన పాత్రలను పోషించి, తనదైన ప్రత్యేకతను కృష్ణంరాజు చాటుకున్నారు. మాస్ ఆడియన్స్ మనసు కొల్లగొట్టేసి .. వాళ్లతో రెబల్ స్టార్ అనిపించుకున్న కృష్ణంరాజు, తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడారు. తన కుటుంబ నేపథ్యాన్ని గురించి మాట్లాడుతూ.. " మా నాన్నగారి లాంటి గొప్ప తండ్రి చాలా తక్కువమందికి వుంటారు" అన్నారు.
"ఏ తండ్రైనా తన కొడుకును 5 వ సంవత్సరం వరకూ దేవుడిలా .. అప్పటి నుంచి 18వ సంవత్సరం వరకూ కష్టం తెలిసేలా .. ఆ తరువాత నుంచి ఓ స్నేహితుడిలా చూడాలట. నన్ను మా నాన్నగారు అలాగే చూశారు. ఓ స్నేహితుడు గానే ఆయన నన్ను సినిమా ఇండస్ట్రీకి పంపించారు. ఏదైనా విషయం గురించి ఆయనకి చెబితే, అనుభవంతో అన్నీ తెలుస్తాయని అనేవారు. నేను సినిమాల కోసం చెన్నై వెళితే .. ఈ వయసులో పంపిస్తే చెడిపోతాడని మా బంధువులు మా నాన్న దగ్గర గోల చేశారట. దాంతో ఆయన "ఏం .. వాడు నా కొడుకు కాదని మీకేమైనా డౌటా? వాడు నా కొడుకు .. ఎలాంటి పరిస్థితుల్లోను తప్పు చేయడు. నిజాయితీగా ఉంటాడు .. న్యాయమే మాట్లాడతాడు" అన్నారట. నేనంటే ఆయనకి అంత నమ్మకం ఉండేది" అంటూ చెప్పుకొచ్చారు.