coffee: కాఫీల మీద సెల్ఫీలు.. లండన్ కాఫీ షాపు వినూత్నయత్నం!
- కాఫీ నురగతో ముఖాల చిత్రణ
- వినియోగదారులను ఆకట్టుకునే యత్నం
- 'సెల్ఫీచినో' పేరుతో అమ్మకాలు
పెద్ద పెద్ద కాఫీ షాపుల్లో వినియోగదారులను ఆకట్టుకోవడానికి కాఫీల మీద డిజైన్లు వేయడం చూస్తూనే ఉంటాం. కానీ లండన్‌కి చెందిన 'ద టీ టెర్రస్' అనే కాఫీ షాపు చేసిన వినూత్న ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటోంది. కాఫీ మీద సెల్ఫీలు ముద్రించి, తమ ముఖాన్ని తామే తాగే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ప్రత్యేక కాఫీలకు సెల్ఫీచినో అని పేరు కూడా పెట్టింది. సెల్ఫీచినో అంటే సెల్ఫీ, క్యాపచినో పేర్ల కలయిక.
యూరప్‌లో ఇలాంటి కాఫీలను ప్రవేశపెట్టిన మొదటి కాఫీ దుకాణం ఇదే. కాఫీలు లేదా హాట్ చాక్లెట్ డ్రింక్‌ల మీద తమ సెల్ఫీని ముద్రింపజేయాలనుకునేవారు ముందు ఆన్‌లైన్ మెసేజింగ్ యాప్ ద్వారా తమ సెల్ఫీలను పంపించాల్సి ఉంటుంది. వారు పంపిన సెల్ఫీలను కాఫీ తయారీ మెషీన్లో అప్‌లోడ్ చేసి కాఫీ మీద ప్రింట్ చేస్తారు.
ఈ కాఫీ ప్రింటింగ్ కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఫుడ్ కలర్‌ని వీరు ఉపయోగిస్తారు. కాఫీ నురగతో ఈ సెల్ఫీని ప్రింట్ చేయడానికి దాదాపు నాలుగు నిమిషాల సమయం పడుతుంది. అయితే ఈ కాఫీని డెలివరీ చేయడానికి ముందు దాని ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ కూడా చేస్తారు. ఇలా తయారుచేసిన ఒక్క కాఫీ కోసం రూ. 500 వరకు ఛార్జీ చేస్తారు.
ఇన్‌స్టాగ్రాం లాంటి సోషల్ మీడియా మాధ్యమం వచ్చాక వినూత్న ఫొటోలకు ప్రాధాన్యం పెరిగిందని, కేవలం రుచి కోసమే కాకుండా, ప్రెజంటేషన్‌కి కూడా ప్రాముఖ్యత ఇస్తున్నారని, అలాంటి వారిని ఆకట్టుకోవడం కోసమే తాము ఈ కొత్తరకం సెల్ఫీచినో కాఫీని ప్రవేశపెట్టినట్లు ద టీ టెర్రస్ యజమాని ఇహాబ్ సాలెం తెలిపారు. ప్రారంభించిన రెండ్రోజుల్లోనే 400కి పైగా సెల్ఫీచినోలను అమ్మినట్లు, తమ ప్రయత్నం ఇన్‌స్టాగ్రాంలో వైరల్ గా కూడా మారిందని ఆమె అన్నారు.