Winter: ఆదిలాబాద్‌లో 120 ఏళ్ల రికార్డు బద్దలు.. 3.8 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత!
- తెలంగాణలో రికార్డులు బద్దలుగొడుతున్న చలిపులి
- రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు
- పిల్లలు, రోగులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు
తెలంగాణలో చలి పులి రికార్డులు బద్దలుగొడుతోంది. దాని దెబ్బకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో శీతల గాలులు వీస్తుండడంతో చలికి బెంబేలెత్తుతున్నారు. ఆదిలాబాద్‌లో ఎన్నడూ లేని విధంగా మంగళవారం ఉష్ణోగ్రత 3.8 డిగ్రీలకు పడిపోయింది. తెలంగాణలో గత 120 ఏళ్లలో ఇదే అత్యల్పం. మెదక్‌లో 8, భద్రాచలం, రామగుండంలో 12, హైదరాబాద్‌లో 13 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు చెబుతున్నారు.
1897 డిసెంబరు 17న రాత్రి నిజామాబాద్‌లో 4.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ఆ తర్వాత డిసెంబరు 20, 2014న ఆదిలాబాద్‌లో 3.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పుడు గత రికార్డులను చెరిపేస్తూ సరికొత్త రికార్డు నమోదైంది. 2010 డిసెంబరు 22న మెదక్‌లో 7.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, మంగళవారం ఉదయం 8 డిగ్రీలు నమోదైంది.
వృద్ధులు, చిన్నారులు, రోగులు చలి విషయంలో జాగ్రత్తగా ఉండాలని, బయటకు వచ్చేముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మధ్యభారతం నుంచి ఉత్తర తెలంగాణ సరిహద్దుల వరకు అధిక పీడనం ఏర్పడడం వల్ల తెలంగాణలోకి శీతల గాలులు వీస్తున్నాయన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ మన్యం కూడా చలి గుప్పిట్లో చిక్కుకుని గజగజలాడుతోంది. మంగళవారం ఉదయం లంబసింగిలో 3, చింతపల్లిలో 4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.