KCR: ఆ మాట వింటే నాకు చాలా బాధ కలిగింది!: మహాసభల ముగింపు సభలో కేసీఆర్
- తెలుగు భాషను బతికించుకోవాలనే మాటలు విన్నాం
- మృత భాష అనే మాటలు వినాల్సి వస్తోంది
- మన నేలపైనే అటువంటి మాటలు వినాల్సి వస్తోంది
- ఆ పరిస్థితి మన భాషకు పట్టకుండా చూస్తా
'తెలుగు భాషను బతికించుకోవాలనే మాటలు విన్నాం.. నాకు కొంత బాధ కలిగింది. ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ తెలుగు మృత భాష కాకూడదని అన్నారు. తెలుగు నేల మీదే మన భాషను మృత భాష అని, బతికించుకోవాల్సిన భాష అని అంటోన్న మాటలు వినవలసి వస్తోంది. ఆ పరిస్థితి మన భాషకు పట్టకుండా ఉండడానికి తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంది' అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
ఐదు రోజుల నుంచి తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోన్న ప్రపంచ తెలుగు మహాసభలు కాసేపట్లో ముగియనున్నాయి. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతోన్న ముగింపు వేడుకల్లో కేసీఆర్ మాట్లాడుతూ.. 'సభలు, సంబరాలు జరిపి వదిలేయబోమని చెబుతున్నాం. ఇక నుంచి నిరంతరంగా ప్రతి ఏటా డిసెంబరులో రెండు రోజుల పాటు తెలంగాణ తెలుగు మహాసభల పేరుతో సభలు నిర్వహించబడతాయని ఈ సందర్భంగా తెలుపుతున్నా. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు భాష సబ్జెక్టును తప్పనిసరి చేస్తున్నాం. ఈ గడ్డ మీద చదువుకోవాలంటే తెలుగును ఒక సబ్జెక్టుగా నేర్చుకోవాల్సి ఉంటుందని చెబుతున్నాను. వచ్చేనెల భాషా సాహితీ వేత్తల సదస్సును నిర్వహించి వారి నుంచి సూచనలు తీసుకుని తెలుగు భాషను అభివృద్ధి చేస్తాం' అని కేసీఆర్ తెలిపారు.