Balakrishna: మూడు నిమిషాల పాటు అచ్చమైన తెలుగులో ఎవరైనా మాట్లాడగలరా?: సవాల్ విసిరిన బాలకృష్ణ
- తెలంగాణలో పుట్టినవారికి అభిమానించడం తెలుసు, ఎదిరించడం తెలుసు
- తెలుగు భాష అమ్మ పాల వంటిది
- మమ్మీ, డాడీ అని పిలిపించుకోవడం దారుణం
ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రముఖ సినీ నటుడు బాలయ్యను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాంతాలు వేరైనా తెలుగువారంతా ఒకటే అని చెప్పారు. ఈ సభల్లో పాలుపంచుకోవడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. తెలంగాణలో పుట్టినవారికి అభిమానించడం తెలుసు, ఎదిరించడం కూడా తెలుసని చెప్పారు. తెలుగు పదం వింటేనే తన మనసు పులకరిస్తుందని అన్నారు. ఐదు వేల ఏళ్ల క్రితమే తెలుగు జాతి ప్రారంభమైందని చెప్పారు.
తెలుగు భాష తల్లిపాల వంటిదని, పరాయి భాష డబ్బా పాలవంటిదని బాలయ్య అన్నారు. ఎంతో మంది తల్లిదండ్రులు కూడా అమ్మా, నాన్నా అని పిలిపించుకోకుండా మమ్మీ, డాడీ అని పిలిపించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలయ్య ఓ సవాల్ విసిరారు.
మూడు నిమిషాల పాటు పరాయి భాష పదం రాకుండా స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడేవారు ఎవరైనా ఉన్నారా? అంటూ ఛాలెంజ్ చేశారు. తెలుగు భాషలో గోదావరి వంపులు, రాయలసీమ పౌరుషం, తెలంగాణ మాగాణం, కోనసీమ కొబ్బరి నీళ్ల లేతదనం ఉందంటూ కవితాత్మకంగా వర్ణించారు.