dredging corporation: డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ప్రైవేటీకరణ గురించి ప్రధానికి లేఖ రాసిన కేవీపీ
- కంపెనీ నష్టాల్లో లేదని స్పష్టీకరణ
- కమిటీ వేసి విచారణ చేయాలని వినతి
- అందులో పనిచేసే వారి గురించి ఒకసారి ఆలోచించాలన్న ఎంపీ
మినీరత్న కంపెనీ డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో 73.47 శాతం భాగాన్ని ప్రైవేట్ పరం చేయాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరుతూ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉన్న నష్టాలను కేవీపీ లేఖలో పేర్కొన్నారు.
డ్రెడ్జింగ్ కార్పోరేషన్ లాభాల్లో ఉందని, భవిష్యత్తులో ఇంకా ఉత్తమ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ కంపెనీని ప్రైవేట్‌పరం చేయడం వల్ల పర్యావరణానికి కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని, దేశానికి, వనరులకు నష్టం వాటిల్లుతుందని వివరించారు. అంతేకాకుండా.. ఆ సంస్థలో పనిచేసే వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు రోడ్డున పడతాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రైవేటీకరణ గురించి ఒకసారి ఆలోచించాలని, నిర్ణయాన్ని అమలు చేసేముందు ఓ నిపుణుల కమిటీ వేసి విచారణ చేపట్టాలని ఆయన ప్రధాని మోదీని కోరారు.