note ban: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో.. కొత్త నోట్ల ముద్రణకు వేల కోట్లలో ఖర్చు!
- రెండువేల నోట్ల ముద్రణకు రూ.1,293.6 కోట్ల ఖర్చు
- రూ. 500 నోట్ల ముద్రణకు రూ.4,968.84 కోట్లు
- రూ. 200 నోట్లకు రూ. 523 కోట్లు
- లోక్‌సభకు వెల్లడించిన ఆర్థిక శాఖ
పెద్ద నోట్ల రద్దు తర్వాత అందుబాటులోకి వచ్చిన కొత్త నోట్ల ముద్రణకు అయిన ఖర్చు వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ లోక్‌సభకు తెలియజేసింది. ఈ వివరాల ప్రకారం కొత్తగా తీసుకొచ్చిన రూ.500 నోట్ల ముద్రణకు రూ.5 వేల కోట్లు ఖర్చయినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పి.రాధాకృష్ణన్ లోక్‌సభకు తెలియజేశారు. డిసెంబరు 8వ తేదీ వరకు దాదాపు 1,695.7 కోట్ల ఐదొందల నోట్లను ముద్రించారు. వాటి ముద్రణకు రూ.4,968.84 కోట్లు ఖర్చయింది.
దీంతో పాటు 365.4 కోట్ల రెండువేల నోట్ల ముద్రణకు రూ.1,293.6 కోట్లు ఖర్చయినట్లు మంత్రి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. అలాగే.. 178 కోట్ల రూ.200 నోట్ల ముద్రణకు రూ.522.93 కోట్లు ఖర్చయ్యాయి. నోట్ల రద్దు తర్వాత 99 శాతం పాత రూ.1000, రూ.500 నోట్లు వెనక్కి వచ్చాయని ఆయన తెలిపారు. జూన్ 30, 2017 నాటికి రూ.15.28 లక్షల కోట్ల రద్దయిన నోట్లు ఆర్బీఐకి వచ్చి చేరినట్లు మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి పేర్కొన్నారు.