Bit Coin: బిట్ కాయిన్ పేరు చెప్పి రూ. 200 కోట్లు దండుకున్న వైకాపా నేత!
- తెలుగు రాష్ట్రాలను తాకిన క్రిప్టో కరెన్సీ సెగలు
- దందా మొదలు పెట్టి కోట్ల డబ్బు దండుకుంటున్న మాఫియా
- రంగంలోకి దిగిన పోలీసులు
ప్రపంచాన్ని శాసిస్తున్న క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ సెగలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను తాకాయి. బిట్ కాయిన్ లో పెట్టుబడులు పెడితే, రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావచ్చంటూ వైకాపా నేత ప్రచారం సాగించి, సుమారు రూ. 200 కోట్లు దండుకోగా, పోలీసులు రంగంలోకి దిగారు. ప్రకాశం జిల్లాలో ఈ బిట్ కాయిన్ మాఫియా దందా జోరుగా సాగుతుండగా, దానికి చెక్ చెప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తన స్వగ్రామమైన కలిగిరి కేంద్రంగా బిట్ కాయిన్ దందాకు తెరలేపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రామకృష్ణారెడ్డి, కోట్లు దండుకున్నాడని తెలుస్తోంది.
బ్లాక్ మనీని దాచుకునే వారిని టార్గెట్ చేస్తూ, వారికి బిట్ కాయిన్ గురించి వివరించి చెబుతూ, ఈ దందాకు శ్రీకారం చుట్టాడు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తన నెట్ వర్క్ ను విస్తరించి, అందిన చోట అందినంత దండుకున్నాడు. ఈ విషయం పోలీసుల విచారణలో తేలగా, ప్రస్తుతం రామకృష్ణా రెడ్డి ఎక్కడ ఉన్నాడన్న ఆచూకీ తెలియడం లేదని సమాచారం. ఈ వ్యవహారంపై మరింత సమాచారం వెలువడాల్సివుంది.