Airtel: ఎయిర్‌టెల్‌కు దెబ్బ మీద దెబ్బ.. గ్యాస్ సబ్సిడీని వెనక్కి ఇవ్వాలని ఆయిల్ కంపెనీల డిమాండ్
- ఆధార్ దుర్వినియోగం కేసులో ఎయిర్‌టెల్‌కు మరో చిక్కు
- ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకులోకి మళ్లించిన నిధులను వెంటనే బదిలీ చేయాలని చమురు కంపెనీల డిమాండ్
- నష్టనివారణ చర్యలకు సిద్ధమైన భారతీ ఎయిర్‌టెల్
- వడ్డీతో కలిపి చెల్లించేందుకు సిద్ధమంటూ ఎన్‌పీ సీఐకి లేఖ
టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆధార్ దుర్వినియోగం ఆరోపణలపై కంపెనీ ఈ-కేవైసీ లైసెన్స్‌ను యూఐడీఏఐ తాత్కాలికంగా నిలిపివేసింది. ఖాతాదారుల అనుమతి లేకుండా వారి పేరున ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకులో ఖాతాలు తెరవడం, వారికి తెలియకుండా గ్యాస్ సబ్సిడీని ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించడంపై ఆరోపణలు రావడంతో యూఐడీఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఎయిర్‌టెల్ మొబైల్ నంబర్లకు ఆధార్ అనుసంధానం చేయడం, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకులో కొత్త ఖాతాలు తెరిచే అవకాశాన్ని ఎయిర్‌టెల్ కోల్పోయింది.
తాజాగా ఎయిర్‌టెల్‌కు మరో దెబ్బ తగిలింది. ఖాతాదారుల వంట గ్యాస్ సబ్సిడీని ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించిన భారతీ ఎయిర్‌టెల్‌కు ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు షాకిచ్చాయి. ఆయా ఖాతాల నుంచి మళ్లించిన వంట గ్యాస్ సబ్సిడీని తిరిగి పూర్వపు ఖాతాల్లోకి లేదంటే చమురు కంపెనీల ఖాతాల్లోకి మళ్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆయిల్ కంపెనీల డిమాండ్ ప్రకారం.. గతంలో 31 లక్షల ఖాతాల నుంచి మళ్లించిన రూ.167.7 కోట్ల వంట గ్యాస్ సబ్సిడీ నిధులను ఖాతాదారుల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించాల్సి ఉంటుంది. లేదంటే ఆయిల్ కంపెనీల ఖాతాల్లో జమచేయాల్సి ఉంటుంది.
మరోవైపు చేసిన తప్పును అంగీకరించిన ఎయిర్‌టెల్ నష్టనివారణ చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఖాతాదారుల ఎస్‌బీ ఖాతాల్లోంచి మళ్లించిన రూ.167.7 కోట్ల వంట గ్యాస్ సబ్సిడీని వడ్డీతో కలిపి మొత్తం రూ.190 కోట్లను తిరిగి చెల్లించేందుకు రెడీ అయింది. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు లేఖ రాసింది.