birth certificate: ఫిబ్రవరి 30న జన్మించినట్లు బర్త్ సర్టిఫికేట్.. ఇబ్బంది పడుతున్న యువకుడు!
- లూధియానాలో ఇబ్బంది పడుతున్న యువకుడు
- ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోని అధికారులు
- ఆగిపోయిన చదువు, పాస్‌పోర్టు
ప్రభుత్వాధికారుల తప్పిదాల వల్ల సామాన్య జనం ఇబ్బందులు పడటం చూస్తూనే ఉంటాం. లూధియానాకు చెందిన హర్‌ప్రీత్ సింగ్ కూడా అలాంటి ఇబ్బందులే ఎదుర్కుంటున్నాడు. జనన ధ్రువీకరణ పత్రంలో హర్‌ప్రీత్ సింగ్ ఫిబ్రవరి 30న పుట్టినట్లు అధికారులు నమోదు చేశారు. దీంతో అతను పాస్‌పోర్టుకి గానీ, చదువు కొనసాగించడానికి గానీ వీల్లేకుండా పోయింది.
ఈ ధ్రువీకరణ పత్రం మీద సివిల్ సర్జన్‌తో పాటు మరో ముగ్గురు ఆరోగ్యశాఖ అధికారులు సంతకం చేయడం గమనార్హం. 2012లో చదువు ఆపేసిన హర్‌ప్రీత్, 2015లో మళ్లీ ఓపెన్ స్కూల్ ద్వారా పదోతరగతి పరీక్షలు రాశాడు. ఆ తర్వాత 12వ తరగతి కోసం డిసెంబర్ 2016లో జనన ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ అందులో తప్పిదం కారణంగా 12వ తరగతిలో చేరలేక పోయాడు. కనీసం తమ ఊరి యువకుల్లాగా కెనడా వెళ్లి పనిచేయాలనుకున్నాడు. కానీ పాస్‌పోర్ట్ జారీకి కూడా ఈ పుట్టిన తేదీ అడ్డురావడంతో ఆగిపోయాడు. ఇక అప్పటి నుంచి ఎన్ని సార్లు అర్జీ పెట్టుకున్నా అధికారులు స్పందించకపోవడంతో ప్రభుత్వ పాలన మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు.