Tollywood: వ్యభిచార బ్రోకర్ల సెల్ ఫోన్లలో బడాబాబులు... ఏమీ చేయలేమంటున్న పోలీసులు!
- సెల్ ఫోన్ లో పలువురు ధనవంతుల నంబర్లు
- వాళ్లతో వాట్స్ యాప్ గ్రూపులు
- రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడితేనే కేసు పెట్టే వీలుంటుందన్న పోలీసులు
శనివారం అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన సెక్స్ రాకెట్ నిర్వాహకుల సెల్ ఫోన్లలో జంట నగరాలతో పాటు పలు పట్టణాలకు చెందిన బడాబాబుల నంబర్లను కనుగొన్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. వీరితో వాట్స్ యాప్ గ్రూపులను తయారు చేసుకున్న బ్రోకర్లు, వారికి అందమైన అమ్మాయిల చిత్రాలను పంపుతూ ఆకర్షించే ప్రయత్నాలు చేస్తుంటారని, అయితే, ఈ కేసులో కేవలం సెల్ ఫోన్లో నంబర్ చూసి వారిపై చర్యలు తీసుకోలేమని అంటున్నారు.
వ్యభిచారం కేసుల్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినప్పుడు మాత్రమే కేసు పెట్టి ప్రాసిక్యూషన్ చేసే వీలుంటుందని, నంబర్ ఉందన్న కారణంతోగానీ, వారికి చిత్రాలు వెళ్లాయన్న సాక్ష్యంతోగానీ విచారించలేమని స్పష్టం చేశాయి. అయితే, తమ తదుపరి విచారణకు ఈ నంబర్లు కీలకమని పోలీసు ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు జనార్దన్ అలియాస్ జానీ కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.