steve waugh: ద్రవిడ్ ను హేళన చేసిన స్టీవ్ వా.. మిస్టర్ వాల్ ఇచ్చిన సమాధానం ఇదిగో!
- స్టీవ్ వా మాటలు నాకు వినిపించాయి
- ఎక్కువ బంతులు ఆడి, పరుగులు సాధించాలని అనుకున్నా
- సమస్య ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి
2001లో కోల్ కతాలోని ఈడెన్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన చారిత్రాత్మకమైన టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 445 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత్ 171 పరుగులకే ఆలౌటై ఫాలోఆన్ ఆడింది. ఓ వైపు ఆటగాళ్ల పేలవమైన ఫామ్, మరోవైపు 274 పరుగులతో వెనుకబాటు మన ఆటగాళ్లను మరింత నిరుత్సాహానికి గురి చేసింది. రెండో ఇన్నింగ్స్ లో ద్రావిడ్ ఆరో స్థానంలో బరిలోకి దిగాడు. అప్పటికే సగం మంది బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు క్యూ కట్టారు.
మరోవైపు అప్పటికే ద్రావిడ్ ఫామ్ పై తీవ్ర చర్చ జరుగుతోంది. గత కొన్ని మ్యాచ్ ల నుంచి ద్రావిడ్ దారుణంగా విఫలమవుతున్నాడు. దీంతో, క్రీజులోకి వచ్చిన ద్రావిడ్ పై స్టీవ్ వా స్లెడ్జింగ్ కు పాల్పడ్డాడు. ఈ ఇన్నింగ్స్ 6వ స్థానం... తర్వాత 12వ స్థానమా అంటూ హేళన చేశాడు. కానీ, ద్రావిడ్ ఇదేదీ పట్టించుకోలేదు. ఆ తర్వాత ఓ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. బౌలర్లు ఎందరు మారుతున్నా ద్రావిడ్, లక్ష్మణ్ లు భారీ ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ కలిసి 376 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత భజ్జీ మాయాజాలంతో ఆసీస్ 212 పరుగులకే కుప్పకూలింది. భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది. లక్ష్మణ్ 281 పరుగులు సాధించి వెరీ వెరీ స్పెషల్ అనిపించుకున్నాడు.
తాజాగా బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆనాటి ఘటనలను ద్రావిడ్ గుర్తు చేసుకున్నాడు. స్టీవ్ వా మాటలు తన చెవులను తాకాయని.... కానీ, తన దృష్టి మారలేదని చెప్పాడు. గతం, భవిష్యత్తు రెండూ తన చేతిలో లేవని... ప్రస్తుతం మాత్రమే తన ముందు ఉందని, వీలైనని ఎక్కువ బంతులను ఎదుర్కొని పరుగులను సాధించాలని అనుకున్నానని తెలిపాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని చెప్పాడు. సమస్యలు ఎదురైనప్పుడు దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలని, వెనకడుగు వేయకూడదని చెప్పాడు.