laxma reddy: ఇది ప్ర‌పంచంలో మ‌రే భాష‌లో లేని అద్భుత ప్ర‌క్రియ‌: ప్ర‌పంచ తెలుగు మ‌హా స‌భ‌లో మంత్రి లక్ష్మారెడ్డి

  • ర‌వీంద్ర భార‌తిలో రెండో రోజు ప్ర‌పంచ తెలుగు మ‌హా స‌భ‌లు
  • అవ‌ధానం లాంటి అద్భుత ప్ర‌యోగాలు ఇతర‌ భాష‌ల్లో లేవు
  • శ‌తావ‌ధానం, ద్విశతావ‌ధానం వ‌ర‌కు మ‌న భాష అవ‌ధాన ప్ర‌క్రియ‌లు వెళ్లాయి
  • అల‌వోక‌గా, అద్భుతంగా స‌మాధాన‌మివ్వ‌డ‌మ‌నేది మేధ‌తో పెట్టిన విద్య

అవ‌ధానం మ‌రే భాష‌లో లేని అద్భుత ప్ర‌క్రియ అని, ఇలాంటి అద్భుత ప్ర‌యోగాలు తెలుగు భాష సొంత‌మ‌ని, తెలుగు భాష సొగ‌సు ప్ర‌పంచంలో మ‌రే భాష‌కు లేద‌ని తెలంగాణ మంత్రి ల‌క్ష్మారెడ్డి అన్నారు. ప్ర‌పంచ తెలుగు మ‌హా స‌భ‌ల‌లో భాగంగా ర‌వీంద్ర భార‌తి స‌మావేశ మందిరం గుమ్మ‌న్న‌ ల‌క్ష్మీన‌ర్సింహ శ‌ర్మ ప్రాంగ‌ణం, డాక్ట‌ర్ ఇరివెంటి కృష్ణ‌మూర్తి వేదిక‌పై డాక్ట‌ర్ మలుగ అంజ‌య్య అష్టావ‌ధాన కార్య‌క్ర‌మంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ల‌క్ష్మారెడ్డి మాట్లాడుతూ.. భాష సొగ‌సు దాని నిర్మాణ‌, వ్యాక‌ర‌ణ‌, ఉచ్చారణ‌, వివిధ ప్ర‌క్రియ‌ల్లోనే ఉంటుంద‌న్నారు. ప్ర‌జ‌లు మాట్లాడే భాష‌కు అంతం లేద‌న్నారు. అయితే ఆయా భాష‌ల్లో అనేక ప్ర‌క్రియ‌లు, ప‌ద్ధ‌తులు ఉంటాయ‌న్నారు. కొన్ని భాషా ప్ర‌క్రియ‌లు ఆ భాష గొప్ప త‌నానికి ప్ర‌తీక‌గా నిలుస్తాయ‌న్నారు. అందులో ఒక‌టి అవ‌ధాన ప్ర‌క్రియ అని ల‌క్ష్మారెడ్డి అన్నారు.

అష్టావ‌ధానం, శ‌తావ‌ధానం, ద్విశతావ‌ధానం వ‌ర‌కు మ‌న భాష అవ‌ధాన ప్ర‌క్రియ‌లు వెళ్ళాయ‌న్నారు. ఒకేసారి అనేక మంది పృచ్ఛకులు అనేకంగా వేసే ప్ర‌శ్న‌ల‌కు ఎలాంటి జంకు లేకుండా వార‌డిగిన ప‌ద్ధ‌తుల్లోనే అల‌వోక‌గా, అద్భుతంగా, అన‌ర్గ‌ళంగా స‌మాధాన‌మివ్వ‌డ‌మ‌నేది మేధతో పెట్టిన విద్య అన్నారు. ఇందులోనూ అప్ర‌స్తుత ప్ర‌సంగి త‌ర‌చూ అడ్డు ప‌డుతూ వేసే ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబిస్తూనే, అవ‌ధానం కొన‌సాగించ‌డం ఒక్క తెలుగు భాష‌లోనే ఉంద‌న్నారు. ఇలాంటి అనేక ప్ర‌క్రియ‌లున్న తెలుగు భాష మ‌న మాతృ భాష కావ‌డం మ‌న పూర్వ జ‌న్మ సుకృత‌మ‌న్నారు.

కేసిఆర్ చేప‌ట్టిన అనేక కార్య‌క్ర‌మాల్లో ఇది ఒక మంచి కార్య‌క్ర‌మం

తెలంగాణ ఆవిర్భావం త‌ర్వాత సీఎం కేసిఆర్ చేప‌ట్టిన అనేక కార్య‌క్ర‌మాల్లో ఒక మంచి కార్య‌క్ర‌మం ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు నిర్వ‌హించ‌డం అన్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు పాల్గొంటున్న‌, చూస్తోన్న ఈ స‌భ‌ల‌తో తెలుగు ప్ర‌పంచ వ్యాప్త‌మై, ప్ర‌పంచ భాష‌గా మారింద‌న్నారు. తెలుగు ప్ర‌పంచ మ‌హా స‌భ‌ల్లో పాల్గొనే అవ‌కాశం రావ‌డం త‌న అదృష్ట‌మ‌న్నారు. తెలుగు ప్ర‌పంచ మ‌హా స‌భ‌ల్లో పాల్గొంటున్న క‌వులు, క‌ళాకారులు, సాహితీవేత్త‌లు, అత్మీయ అతిథులంద‌రికీ మంత్రి శుభాకాంక్ష‌లు, అభినంద‌న‌లు తెలిపారు.

అద్భుతంగా ప్రారంభ‌మైన తెలుగు ప్ర‌పంచ మ‌హా స‌భ‌లు స‌జావుగా సాగుతున్నాయ‌ని,
విజ‌య‌వంత‌మ‌వ‌డానికి అంద‌రూ కృషి చేయాల‌ని మంత్రి ల‌క్ష్మారెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. అవ‌ధానికి జ్ఞాపిక అంద‌చేసి, శాలువాతో స‌త్క‌రించారు. ఈ అష్టావ‌ధాన కార్యక్ర‌మంలో మూట‌కోడూరు బ్ర‌హ్మం, డాక్ట‌ర్ రాంభ‌ట్ల పార్వతీశ్వ‌ర శ‌ర్మ‌, రాపాక ఏకాంబ‌రాచారి, చిక్కా రామ‌దాసు, బ్ర‌హ్మ‌చారి, అవ‌ధాన ర‌స‌జ్ఞులు, అభిమానులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News