h1b visa: హెచ్ 1బీ వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములకు చెక్ పెట్టేందుకు ట్రంప్ సర్కారు సన్నద్ధం!
- ప్రస్తుతమున్న నిబంధన ఎత్తివేసే ఆలోచన
- అధిక నైపుణ్యాలున్న వారికి ఇచ్చేదే హెచ్ 1బీ వీసా
- అమెరికాలో అధిక శాతం భారతీయులు ఈ వీసాదారులే
అమెరికాలో పనిచేస్తున్న హెచ్1బీ వీసా హోల్డర్లకు రుచించని ఓ నిర్ణయాన్ని ట్రంప్ సర్కారు తీసుకోనుంది. అధిక నైపుణ్యాలు కలిగిన వారు అమెరికాలో పనిచేసేందుకు ఇచ్చే వీసాయే హెచ్ 1బీ. వీరి జీవిత భాగస్వాములు కూడా అమెరికాలో పనిచేసేందుకు నిబంధనల ప్రకారం అర్హత ఉంది. ఇప్పుడు ఈ నిబంధనను ట్రంప్ సర్కారు ఎత్తేయాలనుకుంటోంది. ఇదే గనుక జరిగితే ఆ ప్రభావం భారతీయులపై గణనీయంగానే చూపనుంది. ఎందుకంటే అమెరికాలో పనిచేస్తున్న వారిలో 70 శాతం మంది హెచ్ 1బీ వీసా హోల్డర్లే.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం అత్యధికంగా హెచ్ 1బీ వీసా హోల్డర్లకు ఉపాధినిస్తున్న రంగం. అధిక నైపుణ్యాలున్న ఉద్యోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వీరి జీవిత భాగస్వాములు కూడా అమెరికాలో పనిచేసే అర్హత కల్పిస్తూ గతంలో ఓబామా సర్కారు ఓ నిబంధన తీసుకొచ్చింది. దీంతో 2015 నుంచి హెచ్ 1బీ జీవిత భాగస్వాములు గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని వేచి చూస్తున్నారు.
అయితే, ఈ నిబంధనను రద్దు చేయాలని అనుకుంటున్నట్టు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందుకు కారణాలేంటన్నది అందులో పేర్కొనలేదు. ‘‘అమెరికన్ల కోసం, అమెరికన్ల ఉపాధి కోసం’’ అని ట్రంప్ ఏప్రిల్ లో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈ చర్య తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. జీవిత భాగస్వాములు పనిచేసే అవకాశం లభించకపోతే అమెరికాలో పనిచేసేందుకు ఎంతో మంది హెచ్ 1బీ వీసాహోల్డర్లకు అది ఆటంకమేనని భావిస్తున్నారు.