Andhra Pradesh: టవర్ ఆకృతికే మెజారిటీ ఓటు.. అమరావతిలో నిర్మించనున్న శాసనసభ భవనం డిజైన్ ఇదే!

  • ప్రజల ఓటూ టవర్ ఆకృతికే..
  • నేడు మంత్రివర్గంలో చర్చించిన అనంతరం ఆమోదం
  • 250 మీటర్ల ఎత్తులో నిర్మాణం
  • తటాకంలో కనువిందు చేయనున్న ప్రతిబింబం

ఎట్టకేలకు ఏపీ రాజధాని అమరావతిలో నిర్మించనున్న శాసనసభ భవనానికి సంబంధించిన ఫైనల్ డిజైన్ ఓకే అయింది. టవర్ ఆకృతినే ఫైనల్ చేసిన ప్రభుత్వం నేడు మంత్రివర్గంలో చర్చించిన అనంతరం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. శుక్రవారం విజయవాడలోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో శాసనసభ, హైకోర్టు ఆకృతుల నమూనాలతోపాటు పరిపాలన నగర బృహత్ ప్రణాళికను పరిశీలించారు. ఈ సందర్భంగా గతంలో ప్రభుత్వం సూచించిన మార్పుచేర్పుల గురించి నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు చంద్రబాబుకు వివరించారు.

1350 ఎకరాల్లో నిర్మించే పరిపాలనా నగర ప్రణాళికలను ఇప్పటికే ప్రభుత్వం ఖరారు చేసింది. ఇప్పుడు అందులో పార్కులు, రహదారుల ప్రణాళికలో స్వల్ప మార్పులు చేశారు. శాసనసభ, సచివాలయం, ప్రభుత్వాధికారుల కార్యాలయాలన్నీ ఈ బ్లాక్‌లోకే వస్తాయి. గతంలో శాసనసభ భవనాన్ని ప్రత్యేకంగా ఈ బ్లాక్‌ చివరన కేటాయించారు. ఇప్పుడు దానిని బ్లాక్ మధ్యలోకి తీసుకొచ్చారు.

బ్లాక్ మొత్తం 250 ఎకరాలు కాగా, అందులో 120 ఎకరాల్లో ఓ తటాకంలా ఏర్పాటు చేసి, దాని మధ్యలో శాసనసభ భవనాన్ని టవర్ ఆకృతిలో నిర్మించనున్నారు. తటాకంలో భవనం ప్రతిబింబం కనిపించేలా నిర్మాణం జరుపుతారు. ఈ భవనం ఎత్తు 250 మీటర్లు కాగా, 40 మీటర్ల వరకు పైకి వెళ్లి నగరాన్ని వీక్షించవచ్చు. ఇది మొత్తం నాలుగు విభాగాలుగా ఉంటుంది. శాసనసభ, శాసనమండలి సమావేశ మందిరాలు, సెంట్రల్ హాల్, పరిపాలనా భవనం తదితర విభాగాలుంటాయి. మధ్యలో మ్యూజియం ఉంటుంది.

శాసనసభ భవనం ఆకృతిపై సామాజిక మాధ్యమాల్లో ప్రజాభిప్రాయం కోరగా, 68 శాతం మంది దీనికి ఓకే చెప్పారు. శుక్రవారం నాటికి మొత్తం 24,905 మంది స్పందించగా, వారిలో 17,088 మంది టవర్ ఆకృతికే ఓటేశారు. 7,817 మంది మాత్రం చతురస్రాకారపు ఆకృతికి ఓటేసినట్టు మంత్రి నారాయణ తెలిపారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News