Hyderabad: ఎల్బీ స్టేడియంలో విరబూసిన తెలుగు సౌరభం.. తెలుగు భాషాభివృద్ధికి ప్రతిజ్ఞ!

  • కేసీఆర్‌పై ఉపరాష్ట్రపతి వెంకయ్య ప్రశంసల జల్లు
  • తెలుగును ప్రపంచవ్యాప్తం చేసేందుకు సమష్టిగా కృషి చేయాలని పిలుపు
  • తెలంగాణ సాహిత్య సౌరభాలు విరబూసిన మాగాణమన్న కేసీఆర్ 
  • భువనవిజయంలా ఉందన్న గవర్నర్ నరసింహన్

తెలుగు భాష గొప్పతనాన్ని, సంస్కృతీ, సంప్రదాయాలను భవిష్యత్ తరాలు నేర్చుకునేందుకు వీలుగా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్ట్‌గా చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సర్వదా ప్రశంసనీయమని, ఇదే చొరవను పాలనలోనూ చూపించి ప్రభుత్వ వ్యవహారాలన్నీ తెలుగులోనే జరిగేలా నిర్ణయం తీసుకుంటే భాష మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు.

తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన పాల్కురికి సోమన ప్రాంగణం, బమ్మెర పోతన వేదికపై అట్టహాసంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలను శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్, మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో కలిసి జ్యోతి ప్రకాశనం చేసి లాంఛనంగా ప్రారంభించారు. తొలుత వేదికపై ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లికి నివాళులు అర్పించారు.

వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తెలుగు భాష వ్యాప్తికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేస్తున్న కృషి అమోఘమని కొనియాడారు. విద్యా వ్యవస్థలో తెలుగుకు కీలక స్థానం కల్పించిన తెలంగాణ ప్రభుత్వం పరిపాలనలో కూడా మాతృ భాషకు పెద్ద పీట వేయాలని సూచించారు.

తెలుగు భాష మాధుర్యం ఎంతో గొప్పదని దానిని ఆస్వాదించి పదిమందికీ పంచేందుకు, తెలుగు భాషను దశ దిశల వ్యాపింపజేసేందుకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్‌లోనూ తీసుకోవాలని అన్నారు. దేశంలో హిందీ తరువాత అత్యధికులు మాట్లాడే భాష తెలుగేనని, అంతటి ప్రాముఖ్యత గల భాషను ప్రతి ఒక్కరు నేర్చుకునేందుకు వీలుగా తెలుగులో తెలంగాణ ముఖ్యమంత్రి మహా నిఘంటువును రూపొందించాలని అన్నారు.
 
తెలంగాణ గడ్డపై పుట్టిన కాళోజీ, సినారె, సురవరం ప్రతాపరెడ్డి వంటి సాహితీవేత్తల గొప్పతనాన్ని వివరిస్తూ తమ రచనల ద్వారా వారు తెలంగాణ ప్రజా సాహిత్యానికి ఉపిరి పోశారన్నారు. ముఖ్యంగా ప్రశ్నించే సాహిత్యం, ప్రతిఘటించే సాహిత్యం తెలంగాణలో ప్రాణం పోసుకుంది అన్నారు. ఈ సందర్భంగా తెలుగు భాషను విశ్వవ్యాప్తం చేసేందుకు చేపట్టిన ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ విజయవంతంగా సాగాలని వెంకయ్య ఆకాంక్షించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ అద్భుతమైన సాహిత్యాన్ని పోషించిన గడ్డ అని, పదో శతాబ్దంలోనే సాహిత్య సౌరభాలు వెదజల్లిన నేల తెలంగాణ మాగాణమని అన్నారు. రామరాజు, దాశరథి, సురవరం ప్రతాపరెడ్డి, సినారె, కాళోజీ వంటి ఆనాటి గొప్ప కవులు, సుద్దాల హనుమంతు, అందెశ్రీ, గోరటి వెంకన్న, అంపశయ్య నవీన్, ముదిగంటి సుజాతరెడ్డి వంటి ఈనాటి కవులు తెలంగాణ బిడ్డలే అని అన్నారు. చిన్నతనం నుంచి తెలుగు భాషపై తనకు గల మక్కువను చెబుతూ ఇందుకు కారణం తన గురువు మృత్యుంజయశర్మేనని ఆన్నారు. ఈ సందర్భంగా గురువుని సభకు పరిచయం చేసి, పాదాభివందనం చేసి, సాదరంగా సత్కరించారు.

తెలుగు భాషాభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఆయన ప్రతి సంవత్సరం మహా కవులు అయిన దాశరథి, కాళోజీ పేరిట సాహిత్య అవార్డులను అందచేస్తున్నట్టు తెలిపారు. తెలుగును మరింత అభివృద్ధి చేసేందుకు ఒకటి నుంచి పన్నెండు తరగతుల వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా చేసినట్టు వివరించారు. భాషాభిమానులు, భాషావేత్తలు ఒక కవిని, సాహితీవేత్తను తయారుచేసేందుకు నడుంబిగించాలని అన్నారు. తెలుగు భాష గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు అందించాలన్న సంకల్పాన్ని మనందరం తీసుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
 
 గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఈ సభను చూస్తుంటే ఆది కవి నన్నయ్య నుంచి సి.నారాయణ రెడ్డి వరకు అందరు కలిసి భువన విజయం జరుపుతున్నట్లుగా ఉందంటూ ప్రశంసించారు. తెలుగుభాషను సుసంపన్నం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందన్నారు. నాటి తెలంగాణ కోటి రతనాల వీణ.. ఈనాటి కోటి గొంతుకల భాషా ప్రవీణగా మారాలని ఆయన ఆకాంక్షించారు.

మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహా సభలు ఇంత బ్రహ్మాండంగా జరుగుతాయని ఉహించలేదన్నారు. ఇలా నిర్వహించడం కేసీఆర్‌కే సాధ్యమన్నారు. తెలుగు భాష విశ్వజనీనం అయినదని,   దేశంలో హిందీ తరువాత అత్యధికులు మాట్లాడే భాష తెలుగేనని అన్నారు. యునెస్కో చెప్పినట్లుగా తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలకు తెలుగు నేర్పించాలని సూచించారు. ఇంత గొప్పగా ఈ సభలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వివిధ రాష్ట్రాలలో తెలుగు వారికి గల భాషా సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒకతాటిపైకి తెచ్చి, తెలుగు భాషకు మరింత కీర్తిని సాధించిపెట్టాలని కోరారు.

ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలుగులో మాట్లాడి సభికులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసన సభాపతి మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, ఎంపీలు  కె.కేశవరావు, జితేందర్ రెడ్డి, సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ తదితరులు పాల్గొన్నారు. సభకు ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి సంధానకర్తగా వ్యవహరించారు. సభ ముగిసిన అనంతరం నిర్వహించిన బాణసంచా వెలుగులు ఆకట్టుకున్నాయి.
     

  • Loading...

More Telugu News