KCR: ఆ పదం అర్థంగాక 'శోభన్‌బాబు సినిమా' పాటల పుస్తకాన్ని కొనుక్కున్నాను: కేసీఆర్
- ఓ పాటలో పూతరేకులు అనే పదం ఉంది
- నాకు ఆ పదానికి అర్థం తెలియలేదు
- మా గురువుకి కూడా తెలియలేదు
- ఆంధ్రలో ఒక తియ్యని పదార్థం అని తెలుసుకుని నాకు చెప్పారు
ఆ రోజుల్లో శోభన్‌బాబు నటించిన ఓ సినిమా చూశానని, ఆ సినిమాలోని ఓ పాటలో 'పూతరేకులు' అనే ఓ పదం విన్నానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పూలరేకులకు బదులు పూతరేకులు అని రాశారేమో అని అనుకున్నానని, అప్పుడు తాను ఆ సినిమా పాటల పుస్తకాన్ని కొనుక్కుని చూశానని, అందులో కూడా పూతరేకులు అనే పదమే కనిపడిందని చెప్పారు. ఆ పదానికి అర్థం తెలియక తమ లెక్చరర్‌ని అడిగానని, ఆయనకు కూడా తెలియదని చెప్పారని, ఆ తరువాత ఆ లెక్చరరే ఆ పదానికి అర్థం తెలుసుకుని తనకు చెప్పారని అన్నారు.
ఆంధ్రలో పూతరేకులు అనేది ఒక తియ్యని పదార్థం పేరని, 1972లో అప్పటికి తెలంగాణకు పూతరేకులు రాలేదని అన్నారు. ఇప్పుడు మాత్రం హైదరాబాదులో ఏ మిఠాయి దుకాణంలోకి వెళ్లినా దొరుకుతోందని తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా మొదటి రోజు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తోన్న కార్యక్రమంలో కేసీఆర్ ఉపన్యాసం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పూతరేకులనే తెలుగు వంటకం గురించి, పదం గురించి అలా అప్పట్లో తెలుసుకున్నానని వివరించారు. రాయిలాంటి తనను తన గురువు గారు మృత్యుంజయ శర్మ సానపట్టారని చెప్పారు.
తెలుగులో ఎన్నో తియ్య తియ్యని మాటలు ఉన్నాయని అన్నారు. ఎంత గొప్పవారికైనా మొదటి బడి అమ్మ ఒడేనని అన్నారు. అమ్మ నుంచే మాతృభాషను నేర్చుకుంటామని అన్నారు. అద్భుత సాహిత్యాన్ని పండించిన నేల తెలంగాణ అని అన్నారు. ఎందరో సాహిత్య కుసుమాలు సిద్ధిపేటలోనూ ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పలు తెలుగు పద్యాలు చదివి, వాటి భావాలను వివరించి సభికుల హర్షద్వానాలను అందుకున్నారు.