janasena: స్థల వివాదం రాజకీయ కుట్ర.. కోర్టులో పరువు నష్టం దావా వేస్తాం: జనసేన
- మూడేళ్లు లీజుకు తీసుకున్నాం
- ఆన్‌లైన్‌లో వివరాలు చూసే స్థల యజమానులతో ఒప్పందం
- భూ యజమానులపై ఎటువంటి కేసులూ లేవు
- వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేశారు
ఏపీ రాజధాని సమీపంలోని మంగళగిరిలోని చినకాకానిలో జనసేన పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం లీజుకు తీసుకున్న స్థలం వివాదంలో పడిన విషయంపై ఆ పార్టీ ఈ రోజు మీడియా ముందుకు వచ్చి స్పష్టత నిచ్చింది. విజయవాడలో జనసేన నాయకుడు గద్దె తిరుపతి రావు మాట్లాడుతూ... ఆ స్థల వివాదం రాజకీయ కుట్ర అని అన్నారు. జనసేన పార్టీ ఆ స్థలాన్ని మూడేళ్లు లీజుకు తీసుకుందని తెలిపారు. ఆన్‌లైన్‌లో వివరాలు చూసే స్థల యజమానులతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు.
భూ యజమానులపై ఎటువంటి కేసులూ లేవని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేయడం భావ్యం కాదని అన్నారు. సుబ్బారావు కుమారులు ఆ స్థలాన్ని వారసత్వంగా పొందారని, ఆరోపణలు చేసిన వారిపై తాము కోర్టులో పరువు నష్టందావా వేస్తామని జనసేన నాయకుడు గద్దె తిరుపతి రావు తెలిపారు.