rajanikanth: రాజకీయాల్లోకి రావాలని రజనీ బలంగా కోరుకుంటున్నారా..? అభిమానులతో మళ్లీ భేటీ కానుండడం ఇందుకేనా..?
- ఈ నెల 26 నుంచి 31 వరకు అభిమానులతో భేటీ
- వేదిక చెన్నై, కోడంబాక్కంలో రాఘవేంద్ర కల్యాణ మండపం
- రోజుకు వెయ్యి మందికి అవకాశం
తమిళ అగ్రనటుడు రజనీకాంత్ మనసులో ఏముంది? రాజకీయాల్లో తన అవసరం ఇప్పుడు లేదంటూ ఇటీవలే ఆయనో సందర్భంలో వ్యాఖ్యానించారు. మరి వరుసపెట్టి అభిమానులతో భేటీ కావడం ఎందుకు? రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకునే ఆయన ఈ విధంగా ముందస్తు సన్నాహాలు చేస్తున్నారా? ఇప్పుడు అభిమానులు, పరిశీలకుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలు ఇవి. వీటికి సమాధానం కావాలంటే చాలా ఓపిక పట్టాలన్నట్టుగానే ఉంది పరిస్థితి చూస్తుంటే. ఎందుకంటే రజనీ నిజంగా తన మనసులో ఏముందో బయటపెట్టడం లేదు. కానీ, రాజకీయాల్లోకి రావాలన్న కాంక్ష మాత్రం ఆయన చర్యల ద్వారా వ్యక్తమవుతోంది.
రజనీకాంత్ మరోసారి అభిమానులతో భేటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు రోజుకు వెయ్యి మందితో సమావేశం అయ్యేందుకు రజనీ నిర్ణయించారు. అభిమానులు భారీ సంఖ్యలో రానున్నందున అక్కడ భద్రత కల్పించాలని రజనీ పోలీసులను కోరారు. దీంతో రజనీ రాజకీయాల్లోకి రానున్నారంటూ మరోసారి ప్రచారం ఊపందుకుంది.