TELUGU MAHA SABHALU: తెలుగు మహాసభలకు అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఆహ్వానం లేదా?
- చంద్రబాబుకు అందని ఆహ్వానం
- ఎందుకు పిలవలేదన్న దానిపై సందేహాలు
- పిలిచి ఉంటే సభలకు కళ వచ్చి ఉండేదన్న అభిప్రాయం
అంగరంగ వైభవంగా ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు తెలంగాణ సర్కారు ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి ఇవి హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది తెలుగు ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి. కానీ, పక్కనే ఉన్న మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం అందకపోవడం విమర్శలకు తావిస్తోంది.
తెలుగు జాతి అంతా ఒక్కటే, తెలుగు ఖ్యాతి విశ్వవ్యాప్తం అన్న సందేశాన్ని చాటి చెప్పాలన్న రీతిలో మహా సభల నిర్వహణకు తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ప్రముఖులు అందరినీ పిలిచి సగౌరవంగా సత్కరించాలని సీఎం కేసీఆర్ అధికారులకు స్వయంగా దిశా నిర్దేశం చేశారు. కానీ, చంద్రబాబును మర్చిపోయారా? లేక కావాలనే విస్మరించారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావులను కూడా అతిథులుగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబును కూడా ఆహ్వానించి ఉంటే సభలకు మరింత కళ వచ్చేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకు పిలవలేదన్న దానికి తెలంగాణ సర్కారే స్వయంగా స్పష్టతనిస్తే ఈ సందేహాలకు తెరపడుతుంది.