mobile: దేశంలో 51 శాతం మంది పది నిమిషాలకొకసారి ఫోన్ చెక్ చేస్తున్నారట... సర్వేలో వెల్లడి
- వాట్సాప్ వాడుతున్నవారు 88 శాతం మంది
- ఆన్‌లైన్ రివ్యూస్ మీద ఆధారపడుతున్నవారు 41 శాతం
- అమెరికా, లండన్, భారత్, చైనా దేశాల్లో సర్వే
'మి, మై లైఫ్, మై వ్యాలెట్' పేరుతో ప్రముఖ అంతర్జాతీయ సంస్థ కేపీఎంజీ నిర్వహించిన సర్వేలో దేశంలో 51 శాతం మంది ప్రతి పదినిమిషాలకు ఒకసారి తమ స్మార్ట్‌ఫోన్‌ను చెక్ చేసుకుంటున్నట్లు తేలింది. నోటిఫికేషన్ వచ్చినా, రాకున్నా వారు ఇలా స్మార్ట్‌ఫోన్‌ను చెక్ చేసుకుంటున్నారని నివేదిక వెల్లడించింది. అమెరికా, లండన్, భారత్, చైనా దేశాల్లోని దాదాపు 10,000 మంది మొబైల్ వినియోగదారులు ఈ సర్వేలో పాల్గొన్నారు.
ఈ నివేదిక ప్రకారం 72 శాతం మంది భారతీయులు కాలక్షేపం కోసం స్మార్ట్‌ఫోన్ మీద ఆధారపడుతున్నట్లు వెల్లడించారు. అలాగే 88 శాతం మంది వాట్సాప్ వాడుతున్నట్లుగా నివేదిక పేర్కొంది. అంతేకాకుండా 41 శాతం మంది వినియోగదారులు ఆన్‌లైన్ రివ్యూస్ మీద ఆధారపడి పనులు చేసుకుంటున్నారని, 80 శాతం మంది సమాచారాన్ని క్రోడీకరించి అందజేసే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని నివేదిక వెల్లడించింది. క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్లు వంటి ఆఫర్లకు కూడా భారతీయ వినియోగదారులు విపరీతంగా ఆసక్తి చూపిస్తున్నారని నివేదిక పేర్కొంది.
డిజిటల్ లావాదేవీలు పెంచేందుకు ప్రభుత్వం వివిధ రకాల సేవలను అందిస్తున్నప్పటికీ ఎక్కువ మంది నగదు రూప లావాదేవీలనే వాడుతున్నట్లు తెలిపింది. భారతీయుల ఖర్చులో 68 శాతం అవసరాల కోసం మాత్రమే ఖర్చు పెడుతున్నారని, విలాసాలకు చాలా తక్కువగా కేటాయిస్తున్నారని వెల్లడించింది.