parvez musharraf: ముషారఫ్, హఫీజ్ సయీద్ ల కలయిక ప్రపంచానికే ప్రమాదకరం: పాల్ స్కాట్
- వీరిద్దరూ కలసి ఎన్నికలకు వెళ్తే ప్రమాదకర ఫలితాలు వస్తాయి
- పాక్ విదేశాంగ విధానంలో పెను మార్పులు రానున్నాయి
- పాక్ తో అమెరికా సంబంధాలను తెంచుకోవాలి
పాకిస్థాన్ లో ప్రమాదకరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ డిప్లొమసీ హెడ్ పాల్ స్కాట్ అభిప్రాయపడ్డారు. గృహ నిర్బంధం నుంచి ఇటీవలే విడుదలైన జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్, మాజీ సైనిక నియంత ముషారఫ్ లు కలసి ఎన్నికలకు వెళితే ప్రమాదకర ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు. ముంబై దాడులతో హఫీజ్ కు సంబంధం ఉందనే విషయంపై ఆధారాలు లేవంటూ పాకిస్థాన్ కోర్టులు ప్రకటించడాన్ని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు.
హఫీజ్ రాజకీయాల్లోకి రావడంతో, పాక్ విదేశాంగ విధానంలో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని పాల్ అన్నారు. హఫీజ్ కు ముషారఫ్ బహిరంగంగా మద్దతు పలకడం... జమాత్ ఉద్ దవా, లష్కరే తాయిబాలకు అనుకూలంగా మాట్లాడటం విపరీత పరిస్థితులకు దారి తీసే అవకాశం ఉందని చెప్పారు. వీరిద్దరి కలయిక ప్రపంచానికే ప్రమాదకరమని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్ తో అమెరికా పూర్తి స్థాయిలో బంధాలను తెంచుకోవడమే ఉత్తమమని సూచించారు.