chris gayle: బంగ్లాదేశ్‌లో ‘గేల్’ దుమారం.. రికార్డుల తుపాను!

  • ‘బీపీఎల్‌’లో గేల్ వీర విజృంభణ
  • 69 బంతుల్లో 146 పరుగులు
  • సిక్సర్లతోనే వంద పరుగులు రాబట్టిన విధ్వంసకర ఆటగాడు
  • బీపీఎల్ తొలి టైటిల్ అందుకున్న రంగాపూర్ రైడర్స్

బంగ్లాదేశ్‌లో మంగళవారం ‘గేల్’ దుమారం రేగింది. సిక్సర్లు, ఫోర్ల తుపానుతో మైదానం హోరెత్తిపోయింది. విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్ పూనకం వచ్చినట్టు ఊగిపోయాడు. బ్యాట్‌తో వీర విజృంభణ చేశాడు. అతడి దెబ్బకు పలు రికార్డులు బద్దలయ్యాయి. కొత్త రికార్డులు పుట్టుకొచ్చాయి.

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో భాగంగా మంగళవారం రంగాపూర్ రైడర్స్-ఢాకా డైనమైట్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. రంగాపూర్ రైడర్స్ జట్టుకు ఆడుతున్న గేల్ చెలరేగిపోయాడు. 69 బంతుల్లో 18 సిక్సర్లు, 5 ఫోర్లతో ఏకంగా 146 పరుగులు చేసి ఢాకా డైనమైట్స్‌ జట్టులో కల్లోలం రేపాడు. నాలుగు రోజుల వ్యవధిలో గేల్‌కు ఇది రెండో సెంచరీ. సిక్సర్ల ద్వారానే గేల్ వంద పరుగులు రాబట్టడం విశేషం. గేల్ విజృంభణకు టైటిల్ సొంతమైంది. బీపీఎల్ తొలి టైటిల్‌ను రంగాపూర్ అందుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన రంగాపూర్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 206 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఢాకా డైనమైట్స్ 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేసి 57 పరుగుల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌లో గేల్ సృష్టించిన రికార్డులు ఇలా..

టీ20లలో గేల్ ఇప్పటి వరకు 20 శతకాలు నమోదు చేశాడు. బీపీఎల్‌లో ఐదు సెంచరీలు బాదాడు. తాజా మ్యాచ్‌లో 18 సిక్సర్లు కొట్టిన గేల్..2013 ఐపీఎల్‌లో బాదిన 17 సిక్సర్ల రికార్డును తుడిపేశాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకు 11,056 పరుగులు చేశాడు. టీ20ల్లో గేల్ ఇప్పటి వరకు 819 సిక్సర్లు బాదాడు.

  • Loading...

More Telugu News