dalit man murder: తమిళనాడులో దళితుడి హత్య కేసు.. ఆరుగురికి మరణశిక్ష!

  • 2016లో తమిళనాడులో పరువు హత్య
  • 11 మందిపై కేసు నమోదు
  • ఆరుగురికి మరణశిక్ష.. ఇద్దరికి జైలు శిక్ష

2016 మార్చి 13న తమిళనాడులోని ఉడుమల్ పేటలో ఓ పరువు హత్య జరిగింది. వివరాల్లోకి వెళ్తే, శంకర్ అనే దళిత యువకుడు కౌశల్య అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ వివాహాన్ని అంగీకరించలేకపోయిన కౌశల్య తండ్రి ఉడుమల్ పేట బస్టాండ్ వద్ద పబ్లిక్ గా శంకర్ దంపతులపై దాడి చేశాడు. ఈ దాడిలో శంకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా... కౌశల్య తీవ్ర గాయాలపాలైంది. ఆ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఫుటేజ్ వైరల్ గా మారింది. తమిళనాట ఆ హత్య సంచలనంగా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి పాల్పడ్డ 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 1500 పేజీల రిపోర్ట్ ను తయారు చేశారు.

ఈ హత్య ఉదంతాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం కేసు విచారణ కోసం స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను కూడా నియమించింది. తిరుపూర్ సెషన్స్ కోర్టులో నవంబర్ లో కేసు విచారణ పూర్తయింది. తుది తీర్పును ఈరోజు కోర్టు వెలువరించింది. మొత్తం ఆరుగురికి మరణశిక్షను విధించింది. ఇందులో శంకర్ మామ కూడా ఉన్నారు. మిగిలిన ఐదుగురిలో ఒకరికి జీవితఖైదును, మరొకరికి మూడేళ్ల శిక్షను విధించింది. మిగిలిన ముగ్గురుని నిర్దోషులుగా విడుదల చేసింది. నిర్దోషిగా విడుదలైన వారిలో కౌశల్య తల్లి కూడా ఉంది. న్యాయమూర్తి నటరాజన్ ఈ తీర్పును వెలువరించారు. 

  • Loading...

More Telugu News