xiaomi: భారత బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాల్లోకి అడుగుపెట్టబోతున్న షియోమీ?
- స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మంచి గుర్తింపు
- త్వరలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ
- పేమెంట్స్ బ్యాంక్ బిజినెస్ కూడా
ఎమ్ఐ, రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్లతో భారత మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చైనా సంస్థ షియోమీ... త్వరలో భారత మార్కెట్‌లో బ్యాంకింగ్, ఆటోమొబైల్ సేవలు కూడా అందించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా ఆటోమొబైల్ రంగంలోకి, పేమెంట్ బ్యాంక్ బిజినెస్ ద్వారా బ్యాంకింగ్ రంగంలో అడుగుపెట్టనున్నట్లు సమాచారం.
వీటితో పాటు ల్యాప్‌టాప్‌లు, గేమింగ్ కన్సోల్స్, కంప్యూటర్ పరికరాలు, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులను కూడా భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు షియోమీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాక దుస్తులు, బొమ్మలు, పర్సులు, సూట్‌కేస్‌లను కూడా తయారుచేసేందుకు సంస్థ ఆసక్తి చూపిస్తోందట. ఇప్పటికే చైనాలో షియోమీ ఎలక్ట్రిక్ బైక్‌లు, సైకిళ్లను విక్రయిస్తున్న విషయం తెలిసిందే.
దీన్ని బట్టి చూస్తే అన్ని రంగాల్లోనూ భారత మార్కెట్‌ను శాసించే ప్రయత్నం చేస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఓ రకంగా చైనా ఉత్పత్తుల మన్నిక, నాణ్యతలపై భారతీయులకు ఉండే చిన్నచూపును షియోమీ ఉత్పత్తులు తిరగరాశాయనే చెప్పుకోవచ్చు. ఏదేమైనా వినియోగదారుడికి సంతృప్తి కలిగించే ఉత్పత్తి సంస్థలను ఆదరించడంలో భారతీయులు ఎప్పటికీ ముందుంటారనడానికి ఇది మరో నిదర్శనం.