Kim Jong Un: వర్షమంటే వర్షం... ఎండంటే ఎండ... ఉత్తర కొరియాలో వాతావరణాన్ని కూడా కంట్రోల్ చేసే స్థాయిలో కిమ్!
- అణ్వస్త్ర ప్రయోగాలతో నిద్రలేకుండా చేస్తున్న కిమ్
- ఆయన ఏదనుకుంటే అది జరుగుతుంది
- వాతావరణ నియంత్రణా శక్తులున్నాయంటున్న కొరియన్ న్యూస్ ఏజన్సీ
తరచూ అణ్వస్త్ర ప్రయోగాలు చేస్తూ, అమెరికా సహా పలు దేశాల కంటిపై కునుకు లేకుండా చేస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కు అసాధారణ శక్తులు ఉన్నాయట. ఈ మాట అంటున్నది ఎవరో కాదు ఉత్తర కొరియా అధికార మీడియా 'కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజన్సీ'. కొరియాలో ఆయన ఎండ కావాలని కోరితే ఎండ ఉంటుందని, వర్షం కావాలనుకుంటే వర్షాలు కురుస్తాయని చెబుతోంది.
ఇటీవల అత్యంత క్లిష్టతరమైన మంచు పర్వతాన్ని కిమ్ అధిరోహించగా, ఆపై తీసుకున్న ఫొటోల్లో కిమ్ ఎంతమాత్రమూ అలసి పోయినట్టు కనిపించక పోవడం వెనుక ఆయనకున్న సూపర్ పవర్స్, వాతావరణ నియంత్రణా శక్తులే కారణమని న్యూస్ ఏజన్సీ ప్రత్యేక కథనాలు అందించింది. మౌంట్ 'పక్తు'కు కిమ్ అధిరోహించిన సంగతి తెలిసిందే. దాదాపు 9 వేల అడుగుల ఎత్తుండే ఈ పర్వతాన్ని అంత సులభంగా ఎక్కలేరు.
ఈ పర్వతంపై భాగంలో చిరునవ్వుతో ఉన్న కిమ్ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆయనకున్న ప్రకృతి నియంత్రణా శక్తే, పర్వతాన్ని సులువుగా అధిరోహించేందుకు కారణమైందని ఉత్తర కొరియా ప్రజలు సైతం నమ్ముతున్నారిప్పుడు. కిమ్ జాంగ్, కొరియా సైంటిస్టులు కలసి ఓ సరికొత్త ఔషధాన్ని తయారు చేశారని, ఇది ఎయిడ్స్, ఎబోలా సహా ఎన్నో రకాల క్యాన్సర్లు, నపుంసకత్వం, గుండె జబ్బులను నయం చేస్తుందని, యాంటీ రేడియో యాక్టివ్ గానూ పని చేస్తుందని 'న్యూస్ వీక్' ప్రత్యేక కథనాన్ని అందించింది. మూడేళ్ల వయసులోనే ఆయన కారును నడిపారని, 9 సంవత్సరాల వయసులో సెయిలర్ గా పోటీ పడ్డారని పేర్కొంది.