Narendra Modi: అహ్మదాబాద్ లో ప్రధాని రోడ్ షో రద్దు... వెంటనే 'ప్లాన్ బి'కి వెళ్లిపోయిన నరేంద్ర మోదీ!
- సబర్మతీ నది నుంచి మోదీ విమానం టేకాఫ్
- ధరోయి జలాశయంలో ల్యాండింగ్
- అక్కడి నుంచి ప్రచారం
- అభివృద్ధి జరిగిందని చెప్పేందుకే!
అహ్మదాబాద్ లో నేడు జరగాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో రద్దు కావడంతో ఎలాగైనా ప్రచారం నిర్వహించాలని భావిస్తున్న ఆయన, వినూత్న నిర్ణయం తీసుకున్నారు. తన ప్రణాళికను వెంటనే మార్చేసుకున్న ఆయన, సీ ప్లేన్ ను ప్రచారానికి వాడుకోవాలని నిర్ణయించారు. అమిత్ షా వెల్లడించిన వివరాల ప్రకారం, సబర్మతీ నది నుంచి టేకాఫ్ తీసుకునే మోదీ విమానం, ధరోయి జలాశయంలో ల్యాండ్ అవుతుంది. అక్కడి నుంచి అంబాజీ దేవాలయానికి రోడ్డు మార్గం ద్వారా వెళుతూ ఎన్నికల ప్రచారాన్ని మోదీ నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసే గడువు దగ్గర పడటంతోనే, మోదీ ఇలా 'ప్లాన్ బి' అమలుకు సిద్ధపడ్డారని తెలుస్తోంది.
కాగా, ఇండియాలో ఎన్నికల ప్రచారానికి సీ ప్లేన్ సేవలను వాడుకుంటున్న తొలి ప్రధాని మోదీయే కావడం గమనార్హం. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఊహకు కూడా అందనంత అభివృద్ధి గుజరాత్ లో బీజేపీ హయాంలో జరిగిందని చెప్పడం కూడా మోదీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనకుందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానించాయి. ప్రతి చోటా విమానాశ్రయాలను కట్టలేకపోతున్నామని, అందుకోసం దేశవ్యాప్తంగా 106 ప్రాంతాల్లో విమానాలు దిగేందుకు, ఎగిరేందుకు అనువుగా ఉన్న జలాశయాలను గుర్తించినట్టు మోదీ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.