Pawan Kalyan: పవన్ ఘాటు విమర్శలకు వైసీపీ నుంచి కౌంటర్ లేనిది అందుకేనా?
- పవన్ విమర్శలకు వైసీపీ నుంచి స్పందన కరువు
- పార్టీలో లేని క్లారిటీ.. పీకే సలహా కూడా ఓ కారణం
- జనసేనపై తమ విధానమేంటో తెలియక అయోమయంలో నేతలు
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల పర్యటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలు సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీశారు. ప్రజలకు మేలు జరుగుతుందనుకుంటే ఏం చేయడానికైనా వెనుకాడనని పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. పోలవరం నుంచి ఫాతిమా విద్యార్థుల సమస్య వరకు, ప్రత్యేక హోదా నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల వరకు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పైనా, ఆ పార్టీ చీఫ్ వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపైన విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష పార్టీగా వైసీపీ చేయాల్సిన పనులను తాను చేయాల్సి వస్తోందంటూ నిందించారు. జగన్ వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.
పవన్ టీడీపీపై చేసిన విమర్శలకు ఆ పార్టీ నేతలు స్పందించగా, తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు. పవన్ విమర్శలను తిప్పి కొట్టారు. ఏదైనా మాట్లాడేముందు ఆ విషయం గురించి అవగాహన పెంచుకోవాలని చురకలు వేశారు. బీజేపీ నేతలు కూడా పవన్‌కు కౌంటర్ ఇచ్చారు. అయితే ప్రతిపక్ష వైసీపీ నుంచి మాత్రం స్పందన కరువైంది. దీంతో జనసేనపై వైసీపీ విధానమేంటో తెలియక ఆ పార్టీ నేతలే తలలు పట్టుకుంటున్నారు.
నిజానికి పవన్ విమర్శలపై స్పందించడానికి వైసీపీ నేతలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. సాధారణంగా చీటికి మాటికి మీడియా ముందుకు వచ్చే సీనియర్లు సైతం పవన్ విషయంలో మౌనం దాల్చారు. పవన్‌పై ఎలా రియాక్ట్ కావాలన్న విషయంలో పార్టీలో గందరగోళం నెలకొందని చెబుతున్నారు. పవన్‌పై అతిగా స్పందిస్తే ఎటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న దానిపై పార్టీలో క్లారిటీ కరువైంది. ఒకవేళ పవన్‌పై విరుచుకుపడితే ఆయన స్పందిస్తారు. ఫలితంగా వైసీపీ-జనసేన మధ్య అది వార్‌గా మారుతుంది.
అదే జరిగితే ఇప్పటికే ప్రతిపక్షంగా విలఫమైనట్టు ఆరోపణలున్న వైసీపీకి అది పెనునష్టం కలిగించే అవకాశం ఉంది. దీనికి తోడు పవన్ విషయంలో కొంత సంయమనం పాటించాలన్న ‘పీకే’ సలహా కూడా కొంత కారణమని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపును సొంతం చేసుకోవాలంటే జనసేన మద్దతు ఎంతో అవసరమని పీకే సలహా ఇచ్చారని సమాచారం. ఇటీవల జగన్ తన సొంత చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ గురించి మాట్లాడుతూ ప్రభుత్వంపై పోరాడేందుకు జనసేన వస్తే కలిసి పనిచేస్తామని చెప్పడానికి అదే కారణమని అంటున్నారు.