december: డిసెంబర్‌లోనే 'ఏప్రిల్ ఫూల్' అయిన కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో!
- తప్పుడు ఫార్వర్డ్ మెసేజ్‌ను ట్వీట్ చేసిన బాబుల్
- తప్పుని గుర్తించిన నెటిజన్లు
- ఫూల్ అయినట్లు అంగీకారం
సోషల్ మీడియాలో వచ్చే కొన్ని ఫార్వర్డ్ మెసేజ్‌లు చాలా విచిత్రంగా ఉంటాయి. వాటిలో కొన్ని చాలా ఆసక్తి కలిగిస్తాయి. వాటిని చూడగానే నిజమే అనిపిస్తుంది. అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ముందు వెనకా చూడకుండా వాటిని మరింతగా ఫార్వర్డ్ చేస్తుంటారు. సాధారణ మనుషులు ఫార్వర్డ్ చేస్తే ఫర్వాలేదు. కానీ ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు ఫార్వర్డ్ చేస్తే పరువు పోతుంది. అలా ఓ ఫార్వర్డ్ మెసేజ్‌ను ట్వీట్ చేసి కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో ఫూల్ అయ్యారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే... ఫూల్ అయినట్లు ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు కూడా!
‘వచ్చే ఏడాది జనవరి 1, ఫిబ్రవరి 2, మార్చి 3, ఏప్రిల్ 4, మే 5.. ఇలా డిసెంబర్ 12 వరకు అన్ని తేదీలు ఆదివారం అవుతున్నాయి’ అని ఉన్న ఓ మెసేజ్‌ను బాబుల్ ట్వీట్ చేశారు. అయితే జనవరి 1 ఈసారి సోమవారం అవుతుంది. ఈ విషయాన్ని నెటిజన్లు వెంటనే ట్వీట్ కింద కామెంట్లు చేశారు. ఇలాంటి నకిలీ వార్తలు షేర్ చేసేముందు ఒకసారి చెక్ చేసుకోవాలని, వెంటనే ట్వీట్ డిలీట్ చేయాలని చెప్పారు. అయితే దానికి మంత్రి స్పందించిన తీరు చాలా ఆకట్టుకుంటోంది.
‘ఎవరో ఇలాంటి నకిలీ మెసేజ్‌ను సృష్టించారు. చాలా కోపం వచ్చింది. కానీ, మీరు చెప్పినట్లు నేను ఈ ట్వీట్‌ను తొలగించను. ఎందుకంటే మనమందరం తప్పులు చేస్తుంటాం. లేదంటే డిసెంబరులో ఏప్రిల్ ఫూల్ అవుతుంటాం. ఈ మెసేజ్ వల్ల నేను ఫూల్ అయ్యానని ఒప్పుకొంటున్నాను’ అని బాబుల్ సుప్రియో ట్వీట్ చేశారు.
It’s crazy that someone create such a fake thing !!! Infuriated But I won’t delete it as some of you suggest