cbit: హైదరాబాద్ సీబీఐటీ కాలేజీలో తీవ్ర ఉద్రిక్తత.. ఫర్నిచర్ ధ్వంసం!
- ఫీజులు పెంచేశారని విద్యార్థుల ఆందోళన
- ర్యాలీలు, ధర్నాలతో ఉద్రిక్తత
- పోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట
- కాలేజీకి ఏడు రోజులు సెలవులు ప్రకటించిన యాజమాన్యం
హైదరాబాద్ శివారు గండిపేటలోని సీబీఐటీ కాలేజీ యాజమాన్యం ఒక్కసారిగా ఫీజులు పెంచేసింది. దీంతో ఆ కాలేజీ విద్యార్థులు ఆందోళన బాట పడ్డారు. ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఐదు రోజులుగా వారు చేస్తోన్న ఆందోళనకి విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ రోజు శంకర్పల్లి చౌరస్తాలో సీబీఐటీ కాలేజీ బస్సులను ఏబీవీపీ అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు, ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
ఆందోళన ఉద్రిక్తం కావడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. మరోవైపు కాలేజీలోని పిన్సిపాల్ రూమ్‌లోకి చొచ్చుకెళ్లిన విద్యార్థి నేతలను పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా తోపులాట జరిగింది. కాలేజీలోని ఫర్నీచర్‌ను విద్యార్థులు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం వారం రోజుల సెలవులు ప్రకటించింది. విద్యార్థుల ర్యాలీలు, ధర్నాలతో ఆ ప్రాంతం మారుమోగిపోతోంది.